3676* వ రోజు .......           08-Dec-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

                    కాసానగర మూలల్లో డంపుల పనుల్లో... @ 3676 *

స్వచ్చ -సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ఊరికి దూరంగా మూణ్ణాలుగు కిలోమీటర్ల ప్రాంతపు రహదార్ల బాగు చేతకు 4.15 కే తొందరపడి 9 కోయిలలు ముందే కూయడం మొదలుపెట్టాయి.  అదనంగా 20 కోయిలలు వచ్చి, పని సందడి మొదలై, 6.15 దాక –

1) స్థానిక  నాగేంద్రాలయంలోని  భక్తిపాటలు + స్వచ్ఛ సుందరోద్యమ చైతన్య గీతాలు + పని చేసుకుంటూనే ఆ గీతాలతో గొంతులు కలిపిన స్వచ్చ  సైనికుల కూనిరాగాలు... వెరసి తొలి  సారి చూసే వారికదొక చిన్నపాటి తిరునాళ్లు !

               శని ఆది వారాలు కాకున్నా- అంతదూరంలోని మురికి ఓడుతున్న, కంపుగొడుతున్న పారిశుద్ధ్య పనులకు - మహిళామతల్లులతో సహా 29 మంది - రావడమే వింత!

స్థానికులు గుడి ప్రక్కనే పేర్చిన ఘాటు వాసన డంపింగును, దాని కారకులు వచ్చి పని చేయకున్నా- గంటన్నరపాటు –

1) సీసాలు, గ్లాసులు, 2 సంచుల్లో నింపి,

2) మెరక- పల్లాల్ని చదును గావించి,

3) వంకర టింకరగా పెరిగిన పిచ్చి చెట్లను నరికి, వాలు గుంటల్ని పూడ్చి,

4) ఊరి వైపున్న బజారు మార్జిన్ల గడ్డి నరికి, నానా చెత్త - చెదారాల్ని ప్రోగులు పెట్టి,

5)  రోడ్డు జంక్షన్ ను మరొక మారు శుభ్రపరచి,

2గంటల (అందరివీ కలుపుకొంటే-40 పనిగంటలు) పనులతో వచ్చిన ట్రాక్టరు వ్యర్థాల్ని లోడు చేసుకొని,

6) ఎప్పటికప్పుడు అక్కడ క్రొత్త డంపుల్ని తయారు చేస్తున్న స్థానికులతో డి.ఆర్.కె. గారు మాట్లాడి,

7) 6.15 తరువాత కూడ పూర్తి గాని పనుల్ని రేపటికి వాయిదావేసి, కాఫీల పిదప డాక్టరు గారి

 సమీక్షా వచనాలు విని, గురవయ్య గారి శ్రమోద్యమ నినాదాలకు స్పందించి, సూక్తులు విని,

నేటి రహదారి పారిశుద్ధ్యం సంతృప్తిగా ముగించారు.

రేపటి వారి కలయిక N. లంక- NH 216 జంక్షన్ వద్దనేనట!

               ఏమని కీర్తించ వలెను-3

డెబ్బది - ఎనుబది వయసున ధీరుల దీక్ష గురించా-

గాజుల చేతుల చీపురు గలగల సవ్వడి గురించ-

సర్జరి జరిగిన కళ్లతొ స్వచ్ఛసేవల గురించ-

 దేన్ని తొలుత వర్ణించను? దేన్ని పిదప కీర్తించను?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    08.12.2025