3677* వ రోజు ... ....           09-Dec-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

మళ్లీ రోడ్ల గుంటల, రాదారి మార్జిన్ల పనులే! - @3677*

               మంగళవారం నాడు (9-12-25) వేకువ కూడ రక్షక భట సోదరులతో బాటు 29 మంది కార్యకర్తలే; మరొకమారు కాసానగరపు జంక్షన్ దగ్గరే; పనివేళలు కూడ 4:20-6:15 AM. లే!

                “చివరికి నేటి పని చోటైన కాసానగర జనానికి సౌకర్యప్రదమైన - అసలు వాళ్లే స్వయంగా నిర్వహించుకోదగిన - వీధి పారిశుద్ధ్యంలో ఒకరిద్దరైనా పాల్గొనని చిత్రవిచిత్రమే! నిన్నా-మొన్నా శుద్ధి చేసిన-చదును చేసిన చోట మళ్లీ ప్లాస్టిక్ వ్యర్ధాలు పడిఉన్న కారణమూ అగమ్యగోచరమే!

               ఐతే-ఇవన్నీ నా సొంత ఆలోచనలూ-మాటలూ మాత్రమే! తమ ఊరి, పరిసరాల పరిశుభ్ర సౌందర్యాలకేనాడో అంకితులైన-అదే పనిగా కాలుష్యాలను మళ్లీమళ్లీ విరజిమ్ముతున్న గ్రామస్తుల్ని నిలదీసే అలవాటులేని సేవా మూర్తులైన పాతికమంది సోదర కర్మిష్ఠులవి కావు-అంతులేని సహనంతో తమ బాధ్యతల్ని తీర్చుకుపోవడమే వాళ్ల దినచర్య ! అలా కాకపోతే:

- పుట్ట గుడి ప్రక్క 40 అడుగుల డంపింగులు అలాగే మిగిలిపోయేవి;

- 16 మంది గంటా 50 నిముషాలు చలిగాలిలో సైతం చెమటలు కార్చకపోతే అందులో కొంతభాగం అద్దంలా ఆహ్లాదంగా మారేదే కాదు;

- బాగా ఎత్తైన మట్టి గుట్ట మీద నిలబడి, కోడూరు వారు వద్దంటున్నా గంధం లక్ష్మణ పలుగుతో త్రవ్వగలిగేదా?

- స్పీడ్ బ్రేకర్ల (వేగ నిరోధకాల) వద్ద పడి, వాహన చోదకులకు నరకం చూపుతున్న గుంటలు రాతిముక్కల్తో-మట్టితో పూడి, చదునయ్యేవా?

- తక్కిన 99.5% ప్రజల్లాగా ఈ స్వచ్చ కార్యకర్తలు గూడ కటిక చలికి దడిసి ముడుచుకొనిపడుకొంటే ఈ గ్రామ వీధుల, శ్మశానాల, రహదార్ల సౌందర్యం ఏమైపోయేది?

- పాపం - స్వచ్ఛ కార్యకర్తలకిప్పటికీ నమ్మకమే - ఈ 11 ఏళ్ళకు కాకున్నా 15 ఏళ్లకైనా గ్రామ పౌరుల్లో సానుకూల పరివర్తన వచ్చి, ఊరు బాధ్యతలు పంచుకొంటారని!

               అలాంటి సానుకూల దృక్పథమే కదా - నేటి నిస్పృహ నిరాశామయ లోకంలో కావలసినది?

               నేటి శ్రమదానోద్యమ నినాదాలు ప్రకటించే అవకాశం వేల్పూరి ప్రసాదుది. కాస్త సుదీర్ఘంగా సాగిన DRK గారి సమీక్ష సరే - ఆర్థిక సహకారాల, అప్పుల విషయంలో వారి సూచనలు పాటిస్తేనో ?

               రేపటి శ్రమదానం కూడ కాసానగర జంక్షన్ వద్దనే!

కార్యకర్త కష్టముపై కవిత వ్రాయకుండగలన?

ప్రతి వేకువ వలంటీర్ల క్రమ శిక్షణలను చూస్తూ,

గడ్డికోత యంత్రంతో గడ్డిని కోయుటు తలచుచు,

ఎంగిలి ప్లాస్టిక్ సీసా లేరువారి గమనిస్తూ

దేన్ని మెచ్చి వ్రాయలేను? దేన్ని ఉపేక్షించగలను?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   09.12.2025