పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
ఊరికి దూరంగా NH216 లో 31 మంది సేవలు - @3678*
అవి 11-12 ఏళ్ళుగా సామాజిక బాధ్యుల చర్యలని చల్లపల్లి, పరిసర 7-8 ఊళ్ల వారు మరువరాదు, సహచర గ్రామస్తుల పట్ల ఎంత అభిమానముంటే మాత్రం – పెద్ద పెద్దోళ్ళలాగా ఏదో ఒకటో రెండో రోజులు మీడియా దృష్టిలో పడి ఆపక, ఎవరూ గుర్తించని - కీర్తించని ఈ చీకటి వేళ రహదార్ల బాగుచేతలేమిటో ఆలోచించాలి!
సరే – ఊరొదలి మూడు నాల్గు కిలోమీటర్లు వెళ్తే వెళ్లారు – కాసానగరం దగ్గర గబ్బుకొట్టే డంపింగుల్ని పెళ్లగించి, ప్లాస్టిక్ తుక్కులూ, ప్రాత గుడ్డలూ విడగొట్టి, సైజురాళ్లను వాటి యజమాని కోసం అందంగా పేర్చి, చిన్న రాళ్ళనూ, మట్టినీ విడతల వారీగా కలిపి, రోడ్డు మార్జిన్ల గుంటల్లో నింపి నీళ్లు పోసి, చదును చేసి...... అసలిదంతా ఏమిటి?
పది - పన్నెండు మంది గంటన్నరపాటు కంపు పనుల్ని అంత ఆనందంగా చేయడమేమిటి? 6.15 తర్వాత దుమ్ము కొట్టుకొన్న ఒక్కొక్కళ్ల అవతారాలు చూశారా?
“ఇక చాలు - పని విరమించండి. రేపు చూసుకుందాంలే” అని కార్యకర్తలను ఉద్యమ సారథి బ్రతిమాలడం కూడ గమనించండి!
అరేడుగురు ఆడ కూతుర్లు ఇంటి పన్లు చాలకనా – ఇంత దూరం వచ్చి- అక్కడి వారు హాయిగా నిద్రిస్తుంటే - జంక్షన్ ను శుభ్రపరస్తున్న కృషిని వివేకానంద మందామా - వెర్రి అందామా? హైవే హోదాకు తగిన వేగంతో బస్సులు ట్రక్కులు, ఇతర వాహనాలు దూసుకుపోతుంటే రహదారి డివైడర్లను చాకచక్యంగా సుందరీకరించే సాహసం ఈ మహిళలకవసరమా?
కుర్ర కార్యకర్తలు సరే – వృద్ధాతి వృద్ధులు ఇంత చలిని ధిక్కరిస్తూ, రహదారి బాధ్యతల్ని ఒక తపస్సులాగాచేసుకుపోతారెందుకు? ఏళ్ల తరబడీ వాళ్లు చేస్తున్న స్వచ్చతా తపస్సుకు ఆయా పాంత ప్రజల స్పందనలేవి? ఏదో కాసానగరస్తుల్లో రమేష్ – మరొక దివ్యాంగుడు (చిట్ట చివర్లో మరొకాయన కూడా) తప్ప తక్కిన వాళ్లు తమాషా చూడడమేనా?
నేటి నినాదాలు ప్రకటించే అవకాశం కోవూరి శారద గారిది, పనుల్ని సమీక్షిస్తూ - కొన్ని జీవన మెలకువల్ని అందరి దృష్టికి తెచ్చింది DRK వైద్యుల వారు,
రేపటి మన పని పాటులు కూడ కాసానగర చెక్ పోస్టు వద్దనే!
కలుపుకు కాలాంతకులు
కలుపుకు కాలాంతకులుగ - మురుగుకు యమ దూతలుగా
ప్లాస్టిక్ లకు శత్రువులుగ - పచ్చదనపు పోషకులుగ
పన్నెండేళ్లుగ ఊరును ప్రకాశింప జేస్తుండిన
కార్యకర్తలను గురించి వ్రాయకుండ ఎట్లుందును?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
10.12.2025