3679* వ రోజు ... ....           11-Dec-2025

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

చల్లపల్లి ప్రాంతపు స్వచ్చోద్యమం లో ఇది 3679* వ రోజు

               అటు పోలీసు సిబ్బంది కాని, కాసానగర జీవనులు గానీ పాల్గొనకున్నా సదరు NH 216 రహదారి కూడలిలో 32 మంది కార్యకర్తల 8 వ రోజు బాధ్యతలు!

               ఎందరు వాలంటీర్లు ఎంతగా శ్రమిస్తే ఈ ప్రాంతం చిన్నా-పెద్దా డంపులు తొలగి, రోడ్ల గుంటలు పూడి, తారు రోడ్ల అంచులకు భద్రత పెరిగి, గోనె సంచుల కొద్దీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కులూ, గాజు బుడ్లూ లేని, దుమ్మూ ధూళీ లేని,డివైడర్ల  వ్యర్థాలు కనిపించని అందమైన రహదారి కూడా ఆహ్లాదకరంగా మారిందో అంచనా కట్టండి!

               ఆ 3-4 వందల గజాల 3 వీధుల మార్జిన్లలో ఇప్పుడు ప్రాత గుడ్డలు, ఛండాలంగా పెరిగిన పిచ్చి మొక్కలు, గోనె సంచులు, సారా బాటిళ్లు, కలుపు మొక్కలు  కనిపిస్తున్నాయేమో చూసి చెప్పండి! ప్లాస్టిక్ సంచుల్తో నిండిన మట్టి గుట్టల స్థానంలో మంచి పూల మొక్కలు నాట దగిన చదును చోటులున్నవి చూశారా?

               అసలీ మురికి- చెత్త పనులు ఇందరు కార్యకర్తలు ఎందుకిన్నేళ్లుగా చేస్తున్నారో ఆలోచించారా? ప్రతి రోజూ తెల్లారి 6.30 కల్లా ఈ కష్ట జీవుల ముఖాలూ, బట్టలూ మట్టి కొట్టుకోవడాన్నైనా కనిపెట్టారా?

               చల్లపల్లిలోని, పరిసర గ్రామాల్లోని కొందరు స్వచ్ఛ సౌందర్యాభిమానులు అప్పుడప్పుడూ “అరె ! ఎన్నేళ్ల నుండి ఇంత పెద్ద ఊరిని వీళ్లు ఎంత చక్కగా రూపొందించార్రా- నిజంగా ఈ కార్యకర్తలు మనకోసం వచ్చిన దేవ దూతలే -  ఆ డాక్టరైతే గాంధీ మహాత్ముడంతటివాడే...” అని ఎడాపెడా పొగడడం విన్నాను.

               పొగడ్తల దగ్గర ఆగిపోక - అలాంటి అభిమానుల్లో సగం మందైనా, అప్పుడప్పుడైనా కార్యకర్తలతో కలిసి రాకపోతారా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. కనీసం – ఇంత శుభ్రంగా, పొందికగా మారిన ప్రదేశాన్ని కలుషితం చేయకుంటే  చాలనే సంతృప్తితో కార్యకర్తలున్నారు!

               డా. మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారి నెలవారీ చందా 2,000/- ను అందుకుని,

               6.25 నుండి జరిగిన సమీక్షా సంగతులు ఆస్పత్రి ఉద్యోగిని ప్రశాంతి గారి శ్రావ్య నినాదాలతో మొదలైనవి.

               రేపటితో ఈ రహదారి కూడలి శుభ్రసుందరీకరణ పూర్తి చేయాలని నిర్ణయించుకొన్నారు..

           ఉత్తమ జీవన పథమని

ఊరికి శ్రేయస్కరమని, ఉత్తమ జీవన పథమని,

పర్యావరణ హితమ్మని, ప్రజారోగ్య దాయకమని

మూడు వేల ఏడొందల రోజులుగా శ్రమిస్తున్న

కార్యకర్త కష్టముపై కవిత వాయకుండగలన?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   11.12.2025