3680* వ రోజు ... ....           12-Dec-2025

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

కొందరిలో అసూయ రేకెత్తిస్తున్న మన శ్రమదానం@ 3680*

               ఈ శుక్రవారం (12- 12-25) నాటి అట్టి శ్రమ వేడుక 29 మందిది; సమయం 4.20 & 6.18 నడిమిది; వరుసగా పదో రోజనుకొంటా-కాసానగరం దగ్గరి NH 216 - N. లంక రహదార్ల సంగమంలోనిది;

               దగ్గరగా పరిశీలించిన నాకు నిబిడాశ్చర్యమూ, వాట్సాప్ & ముఖ పుస్తక పాఠకులకు ఒక రకమైన అసూయా కలిగించేది!

               ఐతే ఆ అసూయ ఇతరత్రా అవలక్షణమేగాని, చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమ విషయంలో మాత్రం ఆరోగ్య ప్రదమైన అసూయే! ఉదాహరణకు - 3 రోజుల క్రితం ఇది వ్రాస్తున్న మనిషీ, ఆకుల దుర్గా ప్రసాదూ 60-70 మొక్కల్ని తెనాలిలో వారికి అందజేయడానికి వెళ్లినపుడు -

               సామాజిక బాధ్యులైన అక్కడి కొందరు సందర్భవశాత్తూ వెలిబుచ్చిన “మీ చల్లపల్లిదే అదృష్టమంటే, Dr. DRK దే సదవకాశమంటే, ఏ ఊరి వాళ్లైనా అసూయ పడదగిన అద్భుతమైన- నిస్వార్ధపరమైన వర్కింగ్ టీమ్ ను అక్కడి డాక్టరు తయారు చేసుకొన్నాడు.” అనే ప్రశంస! (ఆ డాక్టరే ఈ సేవకుల సంఘాన్ని కూడగట్టాడో – ఇలాంటి టీమ్ వల్లే అంతటి స్వచ్ఛ రథ సారధి చల్లపల్లిలో పుట్టుకొచ్చాడో అది వేరే విషయం!)

               “ఒకటి మాత్రం కళ్ళెదుటి యదార్థం - ఇక ఈ సమాజసేవా మూర్తుల సమూహం మాత్రం సుస్థిరం! గ్రామం పట్ల వాళ్ల అంకిత భావం శాశ్వతం!

               ఈ ఊరును ఆనందంగా ఆరోగ్యంగా - రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలనుకొనే స్వచ్ఛ కార్యకర్తల ఆంతర్యం సర్వత్రా  అభిలషణీయం!

               లేకపోతే-4.30 కి పనిలో దిగవలసి ఉండగా 4.15 కే 9 మంది కంత తొందరెందుకు? చలికి భయపడడం కాదు- డిశంబరు మాసపు చలినే భయపెడుతూ అరేడుగురు వృద్దులతో, మహిళలతో సహా 29 మంది ఇళ్లకు దూరంగా వెళ్లి, రహదారి సేవలెందుకు? ముళ్ళ కంపల మధ్య పోస్టల్ శ్రీను - శివబాబుల రిస్కీ సేవలెందుకు? రిస్కీ బ్యాచ్ మట్టి పనులు మాత్రం ఎందుకు?

               అంతటి శ్రమ తర్వాత కూడ డ్యాన్సు స్టెప్పులూ, కూని రాగాలూ, సామా జిక శ్రమానందాలూ కనిపిస్తున్నాయంటేనే అర్థంకావడంలేదాఈ చల్లపల్లి - స్వచ్ఛ సుందరోద్యమం ఆషామాషీ వ్యవహారం కానేకాదని?

               పద్మావతి ఆస్పత్రి రిసెప్షన్ ఘటికురాలు లక్ష్మీ సెల్వం గారి ప్రవచిత నినాదాలూ, ఆదివారం 8:30-9:30 నడుమ వక్కలగడ్డ రోడ్డులో ఎలక్ట్రిక్ వాహన విక్రయ కేంద్ర ప్రారంభోత్సవానికి షణ్ముఖ శ్రీనివాసుని సాదర ఆహ్వానమూ,

               రేపటి పనులకై కాసానగరం చెరువు వద్ద కలుసు కోవాలనే నిర్ణయమూ నేటి విశేషాలు!

               ఏది మొదట కీర్తింతును?

స్వచ్చ సారథులు రాకనె శ్రమదానం సాగెననా –

స్వయం ప్రేరణ తొ ఇందరి వేకువ సేవల పైనా-

రాత్రి వేళ శ్మశానముల రాపాడిన సేవలనా-

ఎన్నని నే వర్ణించను? ఏది మొదట కీర్తింతును?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   12.12.2025