3681* వ రోజు .......           13-Dec-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

37 గురితో (13.12.25) శనివారపు రహదారి సేవలు - 3681*

               ఊరికి మరీ దూరంగా కాక - ఇంతగా మంచూ, చలీ వేధించకపోతే- గ్రామ అంతర్గత  వీధిలో ఐతే - 45/50 మంది వచ్చి ఉండేవారు!

               ఒక ప్రక్క వీధి దీపాలు వెలగక కటిక చీకటి, మరొక వంక డ్రైనులో చచ్చిన చేపల దుర్భర దుర్వాసన! వచ్చే - వెళ్లే వేగవంతమైన వాహనాల చోట- కాసానగరం చెరువు నుండి అమరస్తూపం దిశగా 200 గజాల రహదారిసేవలు!

               ఇక ఆ రహదారి బాధ్యతల కోసం ఆబాలగోపాల వృద్ధ చైతన్య ఝరులైన 3-4 గ్రామాల (రామానగరం, చల్లపల్లి , కాసానగర్ , శివరామపురం) స్వచ్ఛకార్యకర్తలు! ఈ చీకటి గుయ్యారం పనుల్లో  లీనమైన సోదర స్వచ్చ కార్యకర్తల భద్రత పట్ల మా ఒకరిద్దరి ఆందోళనలు! పోనీ- ఇంత రిస్కీ స్వచ్ఛ సుందరీకరణ కోసం ఇందులో కొందరు రేపు మానుతారా అంటే మానరు సరి గదా- రేపు ఆదివారపు స్పెషల్ శ్రమదానాల కోసం ఏ 50 మందో తయారు!

               నేటి ఆదర్శ శ్రమదానం వేకువ 4. 20 కాకముందే మొదలై, 6.22 దాక కొనసాగింది.

               లోడింగు విభాగంలో తప్ప కార్యకర్తల అంచనా ప్రకారం పనులు పూర్తైనట్లే. పూర్తికాక చస్తాయా? 150 గజాల నాగాయలంక రోడ్డు పడమటి, డ్రైను వద్ద

1. కత్తులతో పిచ్చి మొక్కల్నీ, గడ్డినీ కోసేవాళ్లు కోస్తుంటే-

2. అక్కడికి దూరంగా 8 మంది కూలిపోయిన విద్యుత్ స్తంభాన్ని నిలబెట్టాలని పారలు, గునపాలతో ప్రయత్నిస్తుండగా-

3. చేపల కంపు వద్ద డ్రైను వ్యర్థాల్ని బైటకు లాగి, ఒడ్డున గలీజుల్ని ప్రోగులు పెడుతుంటే-

4. రోడ్డునూ, మార్జిన్ నూ ఆరేడుగురు ఊడ్చి, శుభ్ర పరుస్తుంటే-

5. రహదారి అంచుల్ని మెరక చేసి ఐదారుగురు దాన్ని రక్షించబూనుకొంటే-

6. ఇంకో ముఠా చెత్తా చెదారాల లోడింగుకు ప్రయత్నిస్తుంటే-

               చూస్తుండగానే 2 గంటల సేవా కార్యక్రమం ఇట్టే ముగిసింది.

               ఇక అప్పుడు మైకందుకొని ఆస్పత్రి ఉద్యోగిని పండలనేని శ్రీ కనకదుర్గ తడబడుతూ త్రివిధ నినాదాలు వల్లించడమూ,

               అంతకుముందు ఈలలు వేసిన తూము వారు ఫోటో తీస్తుండగానే అడపా వారు సూక్తులు ప్రకటించడమూ,

               రేపు కూడ నాగాయలంక బాటలోనే కలువాలనే నిర్ణయమూ జరిగాయి!

      ఏ సంగతి గుర్తింతును

పన్నెండేళ్ళుగ ఊరిని బాగు చేయు పట్టుదలా?

కష్టార్జితమును ఊరికి ఖర్చు పెట్టు త్యాగములా?

పండుగ వేళల చీపురు పట్టి వీధి ఊడుపులా?

ఏ సంగతి గుర్తింతును? దేన్ని విస్మరించగలను?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    13.12.2025