3682* వ రోజు .......           14-Dec-2025

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

ఆదివారం (14-12-25) శ్రమ జీవన సౌందర్యం 42మందిది! @3682*

 సదరు సౌందర్య వేదిక AVG  రోడ్డులోని వామపక్షీయుల స్తూప ప్రాంతంలో వందో- నూటేభయ్యో గజాలు!  మరి ఇందరు సామాజిక బాధ్యతా చాదస్తులు (ఔను- ఆ వైద్య దంపతులేమో మరీ పెద్ద చాదస్తులు, మిగిలిన 40 మందీ తక్కువేంతినలేదు!) 60 కి పైగా పని గంటలు ఏం ఒరగ బెట్టారో చూద్దాం!

               ఇద్దరు ముగ్గురు కరుడు గట్టిన చాదస్తులు అక్టోబరు తుఫానుకు ఏటవాలుగా కూలి ప్రక్క చెట్లలో ఇరుక్కు పోయిన భారీ తాళ వృక్షాన్ని-( అదింకా బ్రతికే ఉన్నది) ఎంత కష్టపడి ముక్కలుగా నరికిందీ చూశాను!

               మరో ముగ్గుర్నలుగురు కాస్త కుర్ర చాదస్తులు వారం క్రితం మృతి చెందిన లేగ దూడకు అంత్యక్రియలు చేశారు. ఆ దుర్వాసనను వాళ్లెలా భరించారో వాళ్లకే తెలియాలి!

               పరమ చాదస్తులైన సుమారు 15 మంది కొన్ని ముళ్ల మండల్తో సహా పిచ్చి చెట్లను తీసేసి, గడ్డినీ తొలగించి, దంతెల్తో పోగులు పెటుతున్నారు- అదొక పిచ్చి మారాజుల లోకం – ఆ గంటన్నర సమయంలో!

               జోడు కత్తుల పంతులుగారొకరూ, ఒంటికత్తుల ఇద్దరూ దరిద్రంగా పెరుగుతున్న ఈత చెట్టును ఎంతగా సుందరీకరిస్తున్నారో చూశాను - అందులోనూ నాకు కనిపించింది సామాజిక - సామూహిక శ్రమ వైభవమే!

               చెత్త ట్రాక్టర్ లో వ్యర్థాలు పట్టక- అంచుల మీద గజం ఎత్తున ఉంటే - అక్కడ కాళీయుని పడగల మీద చిన్ని కృష్ణుడు నాట్యం చేసినట్లుగా ఒక బండి శరత్ ఎగురుతున్నాడు-శంకర శాస్త్రీయ వీడియో దృశ్యం చూడండి!

               మగ చాదస్తులు సరే- నర్సులూ, గృహిణులకూ ఇంత చలిలో అంత దూరంలోని రహదారి సుందరీకరణ చాదస్తమెందుకో?  ఊడ్చి ఊడ్చి  వాళ్ల గూళ్ల నొప్పు లెందుకు ?

               చాల మార్లు DRK వైద్యుడు అలవాటుగా అనేట్లు- వీళ్లు  వీర చాదస్తులో లేక 'సామాజిక బాధ్యత' అనే పిచ్చెక్కిన వాళ్లో కాకపోతే ఇలాంటి పనుల్ని 12 ఏళ్లుగా చేస్తారా?

నేటి సమీక్షలో :

1) ముక్యాల కార్యకర్తల శ్రమ వివరాలు,

2) నవంబరు మాసపు ట్రస్టు జమా ఖర్చులూ,

3) కోట పద్మ  గారు నినదించిన స్వచ్చోద్యమాశయాలు,

4) రేపటి శ్రమదాన వేదిక అమరస్తూపం నుండి అనే నిర్ణయమూ,

5) వక్కలగడ్డ వీధిలో షణ్ముఖ శ్రీనివాసుని విద్యుత్ వాహన  దుకాణ ప్రారంభం

      ఎక్కడ ఆ చల్లపల్లి? ఏమౌతది?

ఎక్కడ తను- ఏమౌతది? ఎక్కడ ఆ చల్లపల్లి?

అంత భూరి విరాళము సమర్పించుట జరిగెనెట్లు?

స్వచ్చ కార్యకర్తల శ్రమ అంతగ కదిలించెనతని

విజయేంద్ర ప్రసాదు గారి విజయముగా భావించెద!

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    14.12.2025