పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
సోమవారం (15-12-25) నాడు కార్యకర్తలు తక్కువ - పని ఎక్కువ 3683*
“తగ్గేదేలే” అనే సినిమా డైలాగులాగా చలీ - మంచూ!
నాగాయలంక రోడ్డు-అమరస్తూపం-కాసానగరం చెరువు మధ్యస్త ప్రదేశమేమో స్వచ్చంద శ్రమదాన క్షేత్రం!
చంద్రుడి వెలుతురు గాని, విద్యుత్ వెలుగులు గాని లేని 100 గజాల్లో పరిమిత సంఖ్యాకుల పరిశుభ్రతా తపస్సులు.
మట్టలు ఎండి, వ్రేలాడుతూ అసహ్యంగా కనిపిస్తున్న పొడవాటి తాటి చెట్టు సుందరీకరణలో మునిగి, గంటన్నర శ్రమించిన ప్రసాదుల ద్వయానిదే అసలు కష్టమంటే! బారైన నిచ్చెన ఎక్కీ, గడ కత్తితో మట్టలు కోసీ, వాళ్లకెందుకంత పట్టుదలో-6.10 తర్వాత ముచ్చటైన ఆ తాడి చెట్టు ఆకృతి చూస్తే అర్ధమౌతుంది.
ఈ కొద్దిమంది కార్యకర్తల 4.20-6.15 సమయ కృషితోనే-ఆ 100 గజాల బాట పడమటి వైపే పుట్టుకొచ్చిన వ్యర్ధాల్ని త్రొక్కి సర్దితే గాని ట్రాక్టరులో ఇమడలేదంటే-కార్యకర్తలెంతగా శ్రమించారో తెలుస్తుంది.
నిన్నటి, నేటి చెట్లు సుందరీకరణతోనూ, కూర్చొనీ వంగొనీ పీకిన పిచ్చి చెట్లూ, గడ్డీ, ఈత మట్టలూ, ఎండు పుల్లలూ, చిక్కుపడిన తాటాకులూ టాక్టరుపైన త్రొక్కిన, డిప్పలందించిన దృశ్యం పరిశీలిస్తే-ఎవరికైనా ఈ రహదారి సుందరీకర్తలకు సహకరించాలనిపిస్తుంది!
అంబటి శంకరుల వారెప్పుడైనా సైలెంట్ వాలంటీరే గాని, సందడీ-కేకలూ లేందే పనిచేయని కోడూరు వారెందుకో ఇవాళ అవి తగ్గించారు!
ఈపూట కూడ చిన్న గోనె సంచీడు ప్లాస్టిక్, గాజు సీసాలూ, గ్లాసులూ దొరికాయి!
అలా 6.15 కు పన్లు ముగించి, కాఫీలందుకొని, అర్ధవలయంగా నిలబడి, శంకరరావు గారు ఉచ్ఛరించిన నినాదాలు పునరుద్ఘాటించి,
ముక్త్యాల శ్రమదానోద్యమ విశేషాలనూ, రెడ్ క్రాస్ సేవా విశేషాలనూ డి.ఆర్.కె.గారు వివరిస్తుంటే విని,
రేపటి శ్రమదానం కూడ అమరస్తూప ప్రాంతమందే అని నిర్ణయించుకొని, నేటి రహదారి సుందరీకరణ ముగించారు.
నాదేంపోయెను
నాదేంపోయెను కూర్చొని పద్యాలను బరుకగలను
త్రిప్పి త్రిప్పి రకరకాల కవిత్వాలు గిలుకగలను
చీకటిలో వీధి పనులు చేస్తుండే వాళ్లు కదా
అసలు కథా నాయకులని అందరు గుర్తించవలెను?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
15.12.2025