పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
ఫిబ్రవరి10 - 33 మంది సేవామూర్తులు -150 గజాల రహదారి పనులు - @3740*
అదీ టూకీగా ఈ మంగళవారపు శ్రమదాన సమాచారం.. కాస్త వివరాల్లోకి వెళితే :
ఈ సమాచారాన్ని ఏదో పైపైన గబగబా చదివేసే వాళ్లకు మరీ అంత విశేషమనిపించకపోవచ్చు, ఏముందిలెద్దూ-పన్నెండేళ్ళ నుండీ జరుగుతున్న గ్రామ ప్రయోజనకర దైనందిన శ్రమదానమే కదా-వాళ్లు తమకు మంచిదనుకొన్న పని చేసుకుపోతున్నారు...అని తీసేయవచ్చు!
కానీ, లోతుగా ఆలోచించగల వాళ్లకు మాత్రం-
ఈ పుష్కరకాలపు బాధ్యతలు “స్తబ్దుగా ఉన్న గ్రామ ప్రజలకు ప్రేరణలనీ, చేసే కార్యకర్తలకూ, గ్రామ సమాజానికీ శ్రేయోదాయకములనీ, ఈ సువిశాల భారతదేశంలోని 6 లక్షల గ్రామాలకూ అవశ్యాచరణీయములనీ, ప్రస్తుత, రాబోవు తరాలకు ఉదాహరణప్రామైన శ్రమసంస్కృతీ వైభవము”లనీ స్ఫురించక పోవు!
“గతాను గతికో లోకః” అన్నట్లు బాధ్యతారాహిత్యానికి అలవాటుపడిన ఈతరం చప్పున ఆ క్రొత్త సంస్కృతికి మారడానికి మరింత సమయం పట్టవచ్చు!
ఇంతకీ ఈ వేకువ శివరామపురాల నడుమ 4.21-6.20 మధ్యస్త 2 గంటల కాలంలో నాలుగూళ్లకు చెందిన కార్యకర్తలు సాధించినది ఏపరమార్థం? ఏ సంస్కృతికి ఈ ప్రస్థానం?... అని ప్రశ్నిస్తే.......
- అవును, స్థానికులనదగిన ఇద్దరో ముగ్గురో శివరామపురాల వాళ్లు కాక, 30 మంది అనువుకాని 3-4 కిలోమీటర్ల దూరాన-కోళ్లఫారం ప్రాంతాన-సాగించిన రకరకాల రహదారి కర్తవ్యాలు సామాన్యమైనవి కావు!
తమ లక్ష్యాల పరిపూర్తి కోసం..
- పడమటి డ్రైనులో తాడిమొద్దుల్ని చెక్కి, అందంగా రూపొందించీ, క్రమపద్ధతిలో సర్దారు,
- ప్రక్కచేను వాళ్ళు కాబోలు కొట్టి పడేసి, అసహ్యంగా కనిపించే తాటాకుల్ని గుట్టలుగా పేర్చారు,
- గడ్డి చెక్కారు, పిచ్చి-ముళ్ల చెట్ల పని పట్టారు, బాటను ఊడ్చారు, చకచకా వ్యర్ధాల్ని ట్రాక్టర్ లో నింపుకొని, శివరాంపురం డంపింగుకు తరలించారు....
6.40 వేళ-సమీక్షా సభకు ముందు చల్లపల్లి సర్పంచి గారు నినాదాలిచ్చారు,
ఈ మంగళవారపు 2 విశేషాలు:
1. ఏ పోపుల పెట్టెలోనో దాచి దాచి పల్నాటి అన్నపూర్ణ గారు 1,000/- రూపాయలను తన ప్రియ సోదరుడు కీ.శే.నరహరిశెట్టి అర్జున సారధి గారి పేరిటా,
తనకు పూజ్యులైన మామ గారు పల్నాటి మల్లిఖార్జునరావు గారి పేరిట 1,380/- రూపాయలను స్వచ్చ చల్లపల్లికి చందాగా సమర్పించడం,
2. చాలా కాలం తరువాత (నిన్న) లాయర్ కొడాలి మురళి గారు స్వచ్ఛ సుందరీకరణలో పాల్గొనడం.
మోపిదేవి పంచాయితీ సెక్రటరీ గారు వచ్చి కలిశారు, ఒక దివ్యాంగ వృద్ధుడు ఈ సామాజిక శ్రమవేడుకలో పాల్గొని, అప్రయత్నపూర్వకంగా డాన్సు చేయనే చేశాడు కూడ!
DRK డాక్టరు సైతం ఈ శ్రమదాన సంఘటనల పట్ల ఎప్పటిలాగే మురిసిపోయాడు!
“రేపటి వేకువ కార్యక్రమం కూడ ప్రాత శివరామపురం దగ్గరి కోళ్లఫారం వద్ద నుండే” అని నిర్ణయించారు!
మొండివాళ్లా? గడుసువాళ్లా? వెర్రి వాళ్లా?
ఎన్నిసేవలు ఎన్ని దీక్షలు - ఇదెవరన్నా నమ్మశక్యమ?
ఇన్ని రహదార్లలో మొక్కలు ఎవరికైనా పెంచసాధ్యమా?
ఊరి చుట్టూ హరిత వనములు మోహరించుట సులభమా?
కార్యకర్తలు మొండివాళ్లా? గడుసువాళ్లా? వెర్రి వాళ్లా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
10.02.2026