పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.
@3862* (12.6.26) – శుక్రవారం సైతం...!
మళ్ళీ అదే నాగాయలంక రహదారి, నిన్నటివలెనే 23 మందే శ్రామికులు, అందులో 10 మంది తొందర కూడ 4:20 కే!
కాకపోతే – వారి తొలి ఉనికి మాత్రం అమరయోధుల స్తూపం వద్ద కాక - 100 గజాల ఉత్తరంగా దోనేపూడి వాని హిమాలయ ఐస్ తయారీ కేంద్రం వద్ద! అక్కడ గాని, పని చోటుల వద్ద గాని, నిన్నటి వానకు చిత్తడి నేలలు!
17 మంది పరిశుభ్ర సుందరీకరణ ప్రయత్నాలు ఆ మంచు గడ్డల కర్మాగార ప్రవేశానికి అటూఇటూ గానే. ఇద్దరు కస్తూరి సోదరుల, మెండు, కోడూరి - అంబటి శంకరుల, వీరశేఖరుల వంటి కర్మిష్ఠుల కష్టంతో గాని సదరు ప్రవేశ మార్గపు 50-60 చ.గజాల ముళ్ళ మొక్కలు తొలిగి, చిల్లరరాళ్లు మాయమై, ఐదారు డిప్పల తుక్కూ, ప్లాస్టిక్ సరంజామాలూ తుడిచిపెట్టుకుపోయి 6.00 కు ఈ మాత్రం చూడచక్కగా కన్పిస్తున్నది!
ఇక ఆ ప్రక్కనున్న పంటకాల్వా, దాని ఉత్తరపుటంచు బాటా కాస్త ముదురు కార్యకర్తలైన బొందలపాటి, సజ్జా, మల్లంపాటి వంటి వారి వంతు! కాలువ అంచుల్లో అంత గడ్డి అంత ఏపుగా ఎలా పెరిగిందో, పిచ్చి మొక్కలుంటే రేపు నీళ్ల నడకనెలా అడ్డుకొంటాయో, రకరకాల సీసాలు ఎంత అనంగీకారయోగ్యంగా ఉన్నాయో నడుం పైకి లేపక పాటుబడిన ఆ కార్యకర్తలకు తెలుసు!
తుక్కుల లోడింగూ, రహదారి ఊడ్పులూ షరామామూలే! రహదారి తూర్పు అంచున, దానిలోతట్టున అన్నపూర్ణ – ఆకుల – భోగాది వాసుల –
1) గద్దగోరు చెట్ల విచ్చలవిడి కొమ్మల కత్తిరింపులూ,
2) వాటిని దక్షిణ దిశకు మోసి కుప్పలుగా పేర్చే పనులూ యధాతధమే!
మంచి నీళ్లు అందించే అనందరావు గారి మనుమడు సంజుతో - చెత్తలోడు స్పెషలిస్టు అంజయ్యతో సహా – ఏ ఒక్కరు లేకున్నా ఈ 3862* వ శ్రమదానం అసంపూర్ణమే కదూ!
6.20 సమయంలో మెకానిక్ భరత్ నినాదాలు బాగానే చెప్పినా – తన వృత్తి ఒత్తిడి వల్లనూ, కారు డ్రైవింగ్ పనుల కారణంగానూ గైరు హాజరౌతున్నాననే విషయం చెప్పలేదు!
రేపటి N. లంక రహదారి మెరుగుదల కోసం సుబ్బ నాగన్న సత్రం వద్ద కలుసుకొందాం!
అతని చేవ – అతని త్రోవ
డేవిడ్ గోల్కొండ కూడ డిటో - బరువు పనుల్లోన
అతని చేవ – అతని త్రోవ ఆదర్శము యువతలోన
తన శిష్యుల కిందులోన తగు తర్ఫీదులు ఇచ్చును!
బైటివాళ్లనప్పుడప్పుడు స్వచ్ఛ సేవలకు తెచ్చును!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
12.06.2026