3923* వ రోజు.......           13-Aug-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం?

తరిగోపుల ప్రాంగణం వద్ద తనివి తీరా శుభ్ర – సుందరీకరణలు - @3923*

               ఆ సుందరీకరణలు మన సమకాలపు వింతలు! ఆ 37 గురి గుంపు చాల విలక్షణమైనది! వాళ్లు గనుక రోజువారీ కూలీలైతే - మనిషికి 2000/- ఇచ్చినా వేకువ 3.30 కు లేచి, కొందరైతే 4 కిలోమీటర్లు ప్రయాణించి, 4:20 కే ఊరి ఉత్తరపు సరిహద్దు శ్మశానానికి రానేరారు!

               6.20 వేళ నేటి తుది ఆనందకర సమావేశములో DRK గారు ఈ స్వచ్చంద శ్రమదాతలను షిరిడీ వద్ద స్వచ్ఛంద సేవకులతో పోల్చడం నాకు నచ్చలేదు! అవి శారీరక కఠిన శ్రమను ప్రతిబింబించవు – ఈ చల్లపల్లి కార్యకర్తల 12 ఏళ్ల చెమటలు కారే కాయకష్టం “నభూతో – నభవిష్యతి” అనదగినది! ఎంతైనా – దేవాలయ సేవలు, శ్మశాన - డంపింగ్ కేంద్రసేవలూ వేరు కదా!

               నేటి చిల్లలవాగు వంతెన కేంద్రంగా కార్యకర్తల కష్టాలేవో చూద్దాం –

- ఫలానా కార్యకర్త ఫలానా పనే చేయాలనే రూలేం లేదిక్కడ. వక్కలగడ్డ పరిధి నుండి చల్లపల్లి శ్మశాన హద్దు దాక చీపుళ్లకు 8 మందికి చాలినంత పని దొరికింది.

- ఆకుల వాని నాయకత్వంలో వంతెన బారునా ఆరేడు చెట్ల సుందరీకరణ కోసం నలుగురు శ్రమించారు.

- రోడ్డు తూర్పుగా దిగువకు దిగి, చెత్తా చెదారాలు తొలగిస్తున్న, పిచ్చి చెట్లు పనిపడుతున్న కార్యకర్తల్ని గుర్తుపట్టారా? అందులో సర్పంచి దంపతుల్నీ చూడండి.

- చెత్త డిప్పలు ట్రాక్టర్లోకి చేర్చుతున్నదెవరో కనిపెట్టండి.

- “గ్రామ కాలుష్యం, పర్యావరణం, శుభ్రం, సుందరం, ప్రజారోగ్యం, ఆహ్లాదం,

ఆదర్శం....” వగైరాలు చెబుతూ ఇంత పెద్ద - అటు పల్లె - ఇటు పట్టణమూ కాని పురాతన గ్రామం కోసం ఇంకా ఎన్ని లక్షల పనిగంటలపాటు వీధుల్లో - శ్మశానాల్లో కదం త్రొక్కదలచుకొన్నారో ఈ వెర్రివాళ్లని అడగండి!

- కొందరు వర్ణిస్తున్న ఈ “శ్రమదాన మహాయజ్ఞం” లో 4000* రోజుల తర్వాతైనా గ్రామస్తులంతా వచ్చి - హర్షించి, ఆశీర్వదించండి!

- ఇంత సుదీర్ఘకాల శ్రమత్యాగం చల్లపల్లికి ఏమి సాధించినదో ఊరి శ్మశానాలనూ, RTC బస్ ప్రాంగణాన్ని, వీధుల్ని, చుట్టూరా అష్ట రహదారుల్నీ అడగండి!

ఈ పూట కనీసం ఓ పాతిక మంది క్రొత్త కార్యకర్తలు వస్తే :

- నేటి నిస్వార్థ శ్రమ పట్ల DRK గారి ఆనందమెలాంటిదో, అసలీ అత్యద్భుత నందనవనం లాంటి ఈ శ్మశాన నిర్మాణ కష్టనష్టాల చరిత్ర ఎట్టిదో -  దీన్నిలా రూపొందించడంలో ముఖ్యపాత్రధారిణి – పద్మావతి వైద్యురాలి ఉత్సాహమేమిటో - పల్నాటి అన్నపూర్ణమ్మ గారి ఆ నినాదాలెందుకో.... గ్రహించే వాళ్ళు!

               “రేపటి శ్రమ కార్యక్రమం కూడ చిల్లలవాగు వంతెన వద్దే” అని చెప్పనవసరమే లేదనుకొంటాను!

           ఎవరయ్యా ఈ ఆకుల భరతుడు

ఎవరయ్యా ఈ ఆకుల భరతుడు - ఏమిటయా ఇతని వెర్రి?

పగలంతా కష్టపడుచు మెకానిక్కు అవతారం

అది చాలక వేకువనే గంటన్నర శ్రమదానం

ఎంత బరువు పనులకైన ఎప్పుడైన సంసిద్ధం!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   13.08.2026