1987*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు. 

 స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1987* వ నాటి శ్రమ - సమయదానాలు 

          1987* వ నాటి స్వచ్చ సైనికుల గ్రామ శుభ్ర – సుందరీకరణ ప్రయత్నం ఈ వేకువ 4.00 కే మొదలైంది. 36 మంది పాల్గొన్న ఈ స్వచ్చంద శ్రమదానం 6.10, 6.40 వరకూ పొడిగింపుగా సాగింది. వివరించాలంటే – ఇది చల్లపల్లి లో 4 చోట్ల – 3 విధాలుగా పనికి వచ్చింది!

- విజయవాడ బాటలోని శ్రీమంతుల క్లబ్బు – దివంగత కస్తూరి మామ్మ గారి మినీ రహదారి వనం పరిసరాలలో 20 మందికి పైగా కార్యకర్తల 2 గంటల కృషి చోటుచేసుకున్నది. అందరూ సమిష్టిగా నిర్వహించిన ఈ 40 పని గంటల గ్రామ బాధ్యతలలో వీళ్ళు చేయనిదేమున్నది! చీపుళ్లతో రోడ్ల ఊడ్పు, మనకోసం మనం ట్రస్టు వారు పరచిన (పేవర్ టైల్స్) రంగు రాళ్ళ పరిశుభ్రత, కంచె లోపలి మొక్కల సవరణలు, కనపడని గడ్డి – పిచ్చి మొక్కల పీకివేతలు, కాలుష్యకారక సమస్త వ్యర్ధాల ఏరివేతలు, ట్రాక్టర్ లో ఆ ప్రోగులు నింపుకొని ఆ డంపింగ్ కేంద్రానికి చేరవేతలు – ఇలా సుదీర్ఘ కాలంగా నిస్వార్ధంగా స్వగ్రామ బాధ్యతలలో లీనమై ఆనందించే ఈ కరుడు గట్టిన స్వచ్చోద్యమ కారులకు నా అభినందనలు!

- రెస్క్యూ టీం వాళ్ళు ఎప్పుడు – ఏ కష్టమైన పనికి వెనుకాడారు? బికనీర్ హోటల్ పరిసరాల్లో, ఐరన్ షాపు దగ్గర వీళ్ళ శ్రమకూ, కార్చిన చెమటకూ ఈ పొడి మాటలతో వెలకట్టగలనా! నేటి ఒక విశేషమేమిటంటే – నాదెళ్ళ యోగ వేంకటేశ్వరరావు తన షాపు దగ్గర స్వచ్చ కార్యకర్తలు చేస్తున్న మట్టి  పనిని గమనించి తన ఉద్యోగులను కూడా కలిపి పని పూర్తి చేయడం! ఈ ‘నాదెళ్ళ వేంకటేశ్వరుడి’ స్ఫూర్తి అన్ని షాపుల వారికీ, అందరు గృహస్తులకూ – కరోనా స్ధాయిలో  వ్యాపించాలని కోరుకొందాం!

- వీళ్ళు కాక ఆరుగురు కార్యకర్తలు 6 వ నెంబరు పంట కాల్వ పడమటి భాగాన్ని, గట్లను శుభ్రంగా తీర్చి దిద్దారు. 

- సుందరీకరణ కళాకారులు అమరావతి రాజుల “వైజయంతం” ప్రహరీని రంగుల పూల తీగలతోనూ, రాచరికపు కళాత్మక బొమ్మంచులతోను నింపుతూనే ఉన్నారు. ఒక్కసారి ఆ గోడ యజమాని అనుమతినిచ్చాక వీళ్ళు నిరంకుశులే మరి!

          వీళ్ళ కళాతృష్ణ, స్వచ్చ సైనికుల పరిశుభ్రతా తపన, ‘మనకోసం మనం’ ట్రస్టు చిరంతన చింతన గ్రామస్తులందరికీ తొందరలోనే  అంటుకొనుగాక!

          33 ఏళ్ళ ఉస్మాన్ షరీఫ్ అనే కార్యకర్త తన జన్మదిన సందర్భంగా సమర్పించిన 200/- కు కృతజ్ఞతలు!

          రేపటి మన శ్రమదాన బాధ్యతలు బందరు రహదారిలో - అమరావతి జమీందారు గారి వైజయంతం వద్ద చూసుకొందాం.

 

            వివరంగా ప్రకటిస్తా

గ్రామం ప్రతి మూల మూల ప్రతి బాధ్యత స్వీకరించి

దారు లూడ్చి – మురుగులెత్తి – దర్శనీయములుగ మార్చి

వినోదాలు – విజ్ఞానం విహరింపగ చేసి చూపి

స్వచ్చోద్యమ దీపాలను ప్రజ్వలింపజేశారని.... 

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు

సోమవారం – 20/04/2020

చల్లపల్లి.