పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
మంగళవారం (16-12-25) నాటి సామాజిక బాధ్యతలు - @3684*
పాతిక వేలమంది గ్రామస్తులకూ, పరిసర గ్రామ ప్రజలకూ పన్నెండేళ్ళుగా స్ఫూర్తిదాయకులుగా స్వచ్ఛ కార్యకర్తలు ఎందుకు నిలుస్తున్నారో - వానలు, వరదలు, ఎండలు, మంచుల ఋతువుల్లో నిరంతరాయంగా శ్రమదానం ఎందుకు కొనసాగుతున్నదో-
పదే పదే ఈ సమాజం తన అవసరాలను గుర్తుచేస్తున్నా ఏదో ఈ 150 మంది తప్ప గ్రామ అవసరాలను మిగిలిన వాళ్ళు ఎందుకు పట్టించుకోరో -
జిల్లాలూ, రాష్ట్ర సరిహద్దులూ అధిగమించి ఇతర రాష్ట్రాలలో కూడా, 40 కి పైగా ఊళ్లలో ఈ శ్రమదానం ప్రేరణలు కల్గిస్తున్నా - సగం మంది ఈ గ్రామస్తులింకా ఎందుకు స్తబ్దుగా ఉన్నారో-
ఇన్ని వీధులు, చుట్టూ రహదార్లు ఇన్నేళ్లుగా శుభ్రసుందరంగా మారుతున్నా, ఎన్నో సౌకర్యాలు - ఆహ్లాదాలు ‘మనకోసం మనం’ ట్రస్టు అందించడం చూసి కూడా - అనుభవిస్తూ కూడా గ్రామస్తుల క్రియాశూన్యత ఎందుకో -
ఎంతగా ఆలోచించినా తెలియడం లేదు!
ఈ వేకువ కూడ 4.20 - 6.20 నడుమ - అదే అవనిగడ్డ మార్గస్ధ కాసానగర ప్రాంతాన - 40 పని గంటల శ్రమ పాతిక మందిది!
వాళ్లలో మహిళలూ, వృద్దులూ, ప్రమాదంలో కాలు దెబ్బదిన్న రమణ గారు కూడా!
పోనీ – ‘చేసిన పనులేమైనా గౌరవ ప్రదమైనవా, లాభదాయకమైనవా’ అంటే అదేం కాదు! బరువు పన్లూ, మురికి పన్లూ, చెత్త పన్లూ!
ఊరికి అంతదూరంగా-రహదారి మార్జిన్లలో, తుఫాన్లకు దెబ్బతిన్న-విరిగిన, ఒరిగిన చెట్ల వల్ల, అసహ్యకరమైన ప్లాస్టిక్ తుక్కుల వల్ల బాట అందం తగ్గిందట - ఆహ్లాదానికి లోటట - అందుకని ఈ పాతిక మందికి అవన్నీ బాగుచేయందే నిద్రపట్టదట – ఏం చేస్తాం - అది వాళ్ల ఖర్మో, అదృష్టమో, ఆదర్శమో.... ఏదైతే అదే కానీ....
వాళ్ల కోరిక తీరింది - 100 గజాల్లో డ్రైనూ, మొండి చెట్లూ, బాట దుమ్మూ శుభ్రపడ్డాయి!
నిన్నటి పోలీస్ స్టేషన్ వీధిలో కారు భీభత్సం దృష్ట్యా నేటి సమీక్షా సభలో వాహన ప్రామాదిక హెచ్చరికలు గట్టిగా వినిపించాయి.
ఇదే అవనిగడ్డ మార్గంలోనే రేపటి వేకువ మళ్ళీ కలుస్తారట!
చేయి కలుపండీ ఇకనైనా!
సాధారణ మానవుల నొ – చడువులంతగా లేవనో
చెత్త పనులు, మట్టి పనులు చేయు రోజు కూలీలనొ
పొరపడ వద్దండి! అదొక అపూర్వ శ్రమోద్యమంబని
తెలుసుకొనుడు – వచ్చి చేయి కలుపండీ ఇకనైనా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
16.12.2025