3685* వ రోజు .......

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

ప్రకృతినీ, కాలుష్యాన్నీ ఎదురించిన 3685* వ విడత సేవలు!

               ఆ బాధ్యతలు బుధవారం (17-12-25)నాటివి, రికార్డు స్థాయిలో మంచు క్రమ్ముకొన్నవేళ 27 గురు సామాజిక కర్తవ్య పరాయణులలో సగం మంది 4.20 కాకుండానే అవనిగడ్డ రహదారిలో ప్రత్యేకమైన, రకరకాల సాహసాలు ప్రదర్శించిన, గ్రామ-రాష్ట్ర-దేశ చరిత్రలో చిరకాలం నిలువవలసినట్టివి!

               అసలు రాష్ట్రంలోని చాల రహదార్లు ఈ అవనిగడ్డ మార్గాన్ని చూసి, అసూయ పడుతుండవచ్చు - “ఇన్ని పూల, నీడ చెట్లను పెంచి, పెరిగిన తాడి, ఈత, ఇతరేతర చెట్లను సుందరీకరించి, నట్టిళ్లలాగా ఊడ్చి, వారాల తరబడీ బాగుచేసే స్వచ్ఛ కార్యకర్తలు మాకు దొరకరా?” అని!

               ఇంకో ప్రక్కన చల్లపల్లి శ్రమజీవనులేమో “అదృష్టమంటే మాదే! పుట్టి - పెరిగిన ఊరి ఋణం 12 ఏళ్ళుగా తీర్చుకోగలుగుతున్నాం! వేలకొద్దీ గ్రామస్తుల, ప్రయాణికుల ఆహ్లాదకారకులౌతున్నాం...” అని మురిసిపోతుంటారు!

               ఓరి మీ దుంపల్తెగ! వణికించే చలీ - మంచులో 3-4 కిలోమీటర్ల ప్రయాణమేమిటీ - అంత ఎత్తైన తాడిచెట్లను గంటల కొద్దీ సుందరీకరణకు సజ్జా - ఆకుల ప్రసాదుల ప్రమాదకర సేవలేమిటీ - మాలెంపాటి, కోడూరు, ప్రాతూరి వంటి పెద్దల వేకువ పనులేమిటీ -

               బృందావన్, కస్తూరి, సాధనాల, వేల్పూరి, మెకానిక్ భరత్ తదితర యువకార్యకర్తల శ్రమదాన కేరింతలేమిటీ - జంటలు జంటలుగా, విడివిడిగా వీధి ఊడ్పులూ, ప్లాస్టిక్ ల ఏరుడూ, ఉరుకుల పరుగుల లోడింగులూ..... ఇవన్నీ చూస్తుంటే వీళ్లు మహామంచోళ్ళా - పిచ్చోళ్లా అనే సందేహం కలగడం లేదా?

               DRK గారు 6.25 కు చెప్పిందాన్ని బట్టి - ఇలాంటి పిచ్చోళ్లు ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడా ఉన్నట్లు తెలుస్తున్నది! - కాకపోతే ఆ పిచ్చోళ్ళ సంఖ్య చల్లపల్లిలో మరీ ఎక్కువ!

- అలాంటి ఒక పిచ్చాయనే హైదరాబాదీయుడూ – ప్రకృతి కవీ జయరాజు! ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉన్నా, చల్లపల్లి కార్యకర్తల్ని కలసి, అభినందించాలనీ, వాళ్ళ శ్రమదానం పైన పాట వ్రాయలనీ అతని తపన!

- మరో ముదురు పిచ్చి వ్యక్తి “గర్నెపూడి రాజేంద్ర” పుట్టి పెరిగింది కరీంనగర్, వాళ్ళ నాన్న గారిది చీరాల, ఉండేది మేరీల్యాండ్ (USA) లో

- 3 వ కుర్రాడు – నల్లూరి సూర్య వర్ధన్ ది, లాస్ ఏంజలస్,

- 4 వ వ్యక్తి రావి సాయిబిందు - వీళ్లిద్దరూ ‘మనకోసం మనం’ ట్రస్టు ఉద్యోగుల్లో ఇద్దరిని మూడేళ్ళ పాటు దత్తత తీసుకొన్నారట!

               ‘మెకానిక్ భరత్’ నేటి స్వచ్చోద్యమ నినాదకారుడు

               రేపటి వేకువ సేవలు అమరస్తూపం వద్ద నుండే...

వైద్య మురళి కేం అవసరమొచ్చిందట?

చల్లపల్లి స్వచ్చోద్యమ సౌకర్య నిమిత్తంగా

తుక్కు నరుకు యంత్రాన్ని తొందరగా పంపేందుకు

వనపర్తిలొ వైద్య మురళి కేం అవసరమొచ్చిందట?

ఆతడిచ్చు ప్రోద్భలమున కంజలించవలదా మరి?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    17.12.2025