3688* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

                                 నేటి పన్నెండేళ్ల వీధి పండుగ - @3688*

ఇది స్థిరవారం-  20.12.2025 – స్వచ్చ చల్లపల్లి చరిత్రలో వీధి శుభ్రతా అంకురార్పణకు12 వ జన్మదినం! ఆ పిదప 11 నెలల తర్వాత మొదలైన గ్రామ స్వచ్చ సుందరీకరణకు  జనవిజ్ఞాన వేదిక తరపున శ్రమదానోద్యమానికి బీజావాపనం!

దాని పేరు గంగులవారిపాలెం వీధి; అప్పటికది నిత్య పూతి గంధ హేయం! ముఖ్యంగా స్త్రీ ప్రయాణికులకు నరకం!  మరొక మూడేళ్లకు ఆ వీధే ఊరి బజార్లన్నిటికీ తలమానికం - స్వచ్ఛ పరిశుభ్ర నందనం- నిత్యమూ డజన్ల కొద్దీ సౌందర్యారాధకులూ, నడక వ్యామకులూ, వేడుకల వారూ, టీ.వీ. సీరియళ్ల- సినిమాల వాళ్ల సెల్ఫీ ల,  షూటింగుల ప్రదేశం!

ఊరిలోని కమ్యూనిస్టు, సాగర్ బైపాసు వీధులూ,  చుట్టూ రహదార్ల హరిత సుందరీకరణకు  ప్రేరకం!    “ఇంత అద్భుతమైన మార్పు ఒక్కరోజు వచ్చిందా? ఒక్కరితో వస్తుందా? ఇన్నేళ్లు ఆ మార్పు స్థిరంగా నిలుస్తుందా?" అనే ప్రశ్నలకు ఈ శనివారం వేకువ జరిగిన సామూహిక శ్రమదానమూ, సమావేశమూ సమాధానాలు!

ఈ రోడ్డుకు చెందిన సాయి – భవఘ్ని నగర్ నివాసుల్లో ఐదారుగురు తప్ప అందరూ పాల్గొన్నారు, చెత్త ఏరి, గడ్డి తొలగించి, ఊడ్చి  ట్రాక్టరు లోకి ఎత్తి ఆనందించారు, తమ వీధి శ్రమదాన చరిత్ర విని గర్వించారు!

ఒక స్వచ్చ వైద్య జంట గాని, టీచర్లు గాని,  ఇంతటి ఆదర్శాన్ని సాధించగలరా? ఇదొక సామూహిక శక్తి! 'వ్యక్తి' అనే పదానికి బహువచన మేదంటే ఎవరైనా ‘వ్యక్తులు’ అని చెప్పేస్తారు; కాని అతడొక మహా కవి కనుక శ్రీశ్రీ మాత్రమే ఎంతో పెద్ద అర్థాన్ని  కేవలం 10 అక్షరాల్లో

"వ్యక్తికి బహువచనం శక్తి" అని చెప్ప గలడు!

అలాంటి సామాజిక సామూహిక శక్తే ఈ వేకువ చలిలో ముడుచుకు పడుకోకుండా 76 మందిని ఆకర్షించి, వీధిలోకి తెచ్చింది!

దసరా, సంక్రాంతి పండుగలన్ని చోట్లా జరుగుతాయి కాని ఇలాంటి  'వీధి పండుగలు' మాత్రం శ్రమదాన పూర్వకంగా “స్వచ్ఛ – సుందర చల్లపల్లి” లో మాత్రమే జరుగుతాయి! రాష్ట్రాలకూ, దేశానికి మార్గదర్శనం చేస్తాయి!

ఇలాంటి సామూహిక శ్రమదానమే రేపు వేకువ అవనిగడ్డ  రోడ్డులోని అమర వీర స్తూపం వద్ద జరుగుతుంది!

              వెన్నపూస  బ్రహ్మా రెడ్డి కి

సామాజిక సంస్కరణల వెయ్యి గుళ్ల పూజారై

కాలికి బలపం కట్టుక జనం మధ్య సంచరిస్తు

స్వచ్చ సుందరోద్యమాన్ని వచ్చి చూడడం తప్ప

వెన్నపూస  బ్రహ్మానికి వేరే ఏం పని లేదా? 

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    20.12.2025