3689* వ రోజు .......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

37 మందితో అవనిగడ్డ రహదారి పారిశుద్ధ్యం @3689*

               అక్రమాల నెదిరించి, ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్థూపం వద్దనే మెరుగుపడిన రహదారి; చూసేవాళ్ళకేమో ఆ చోటూ, అమర వీర ప్రాంగణం అందంగానే, శుభ్రంగానే అనిపిస్తాయి గాని స్వచ్ఛ కార్యకర్తల చూపే వేరు, ఉద్దేశ్యమే వేరు!

               వాళ్ల చూపులు బాట మార్జిన్లను దాటి, డ్రైన్ వెలిపలి పొలం గట్ల దాక పేరుకుపోయిన చెత్తా చెదారాల మీద పడతాయి, తుఫాన్లకు ఒరిగిన, విరిగిన ఎండిన చెట్ల మీద నిలుస్తాయి. మళ్లీ ఏడెనెది నెలలదాక ఈ రోడ్డు ఎంత బాగుండి పోవాలో-అందుకెంత క్షుణ్ణంగా గడ్డినీ-పిచ్చి చెట్లనూ పీకి, నేలకంటా కోసి, అద్దంలా మెరిపించాలో అంతగా ప్రయత్నిస్తారు; పూల మొక్కలు వాలిపోతే-వెదురు బొంగులు పోటీపెట్టి, నిటారుగా నిలబెట్టి పూయిస్తారు!

               పైకి శుభ్ర-సుందరంగా కనిపిస్తున్నా, అమరుల స్థూపం అంతర్భాగంలో గడ్డి మొలిచిందా, తాము నాటిన మొక్కలు వర్థిల్లుతున్నాయా అనీ ఆలోచిస్తారు. అరేడుగురా పనిలో మునిగిపోతారు!

               స్థూపానికీ-రహదారికీ నడుమ గార్డెన్ పనుల్నే చూడండి-5 గురు సుందరీకర్తలకు ఇద్దరు ముగ్గురు తోడై గంటకుపైగా శ్రమిస్తే ఇప్పుడా భాగం ఎంత కంటికింపుగా మారిందో గమనించారా?

               ఆదివారం కావడంతో-కుర్ర కార్యకర్తలూ, ముదురు కార్యకర్తలు శుభ్రపరచిన బాట పడమటి భాగాన్నీ, 25 నిముషాల పాటు 2 బళ్ల చెత్తను ఒకే ట్రాక్టరులో నింపిన వైనాన్ని కన్నార్పక చూశాను.

               అంతా బాగుంది గాని, 6.30 కు జరిగిన సమీక్షా సభలో ఇంత చీకటి వేళ-వేగంగా వచ్చి పోయే వాహనాలతో కార్యకర్తలకు పొంచి ఉన్న ప్రమాదం పట్ల మాత్రం Dr. DRK గారి భయమూ, పదేపదే హెచ్చరికలూ వినిపించాయి.

               అమెరికా నుండి తన మాతృభూమి బహిరంగ ప్రదేశాల పరిశుభ్రత కోసం తపనపడి, ప్రయత్నించే రాజేంద్ర గారు ఇక్కడి కలెక్టర్ గారితో జరిపిన చర్చలూ, అదివారాల్లో కనీసం పావుగంటపాటు ప్రముఖులూ, ప్రజలూ తమ వీధి పారిశుద్ధ్యం కోసం పనిచేసుకోవాలనే సూచనలూ వివరించి DRK గారు అరేడుగురు కార్యకర్తల నుండి ఆమేరకు వాగ్దానం పొందారు!

               నిన్నటి స్వచ్ఛ సుందర నినాదకుడు తూము వెంకటేశ్వరరావు కాగా, నేటి నినాద కారిణి కోట పద్మ,

               రేపటి పనిచోటు అవనిగడ్డ మార్గంలోని అమరస్థూప ప్రాంతం!

               వింత మాత్రమేమున్నది?

భాగ్య నగర వాస్తవ్యుడు జయరాజను ప్రకృతి కవికి

స్వచ్చోద్యమ చల్లపల్లి  సందర్శన అనివార్యమె

ప్రకృతి రక్షణా బాధ్యులు స్వచ్చోద్యమ కారులకు

ఆత్మీయత పంచుటలో వింత మాత్రమేమున్నది?

- నల్లూరి రామారావు

    ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

    21.12.2025