పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?
23 మందితోనే ద్విగుణీకృత రహదారి బాధ్యతలు - @3690*
నెరవేరిన ఆ బాధ్యతలు సోమవారం (22-12-2025) నాటి వేకువ 4:15 – 6:20 మధ్య జరిగినవి. ఆరు ఋతువుల్లో అన్ని రోజులూ – పగలూ, రాత్రీ అనే భేద భావం లేక 12 ఏళ్ళుగా జరుగుతున్నవి!
నిన్నటి మన వాట్సప్ లో షణ్ముఖ శ్రీను గారు ఆశ్చర్యపడినట్లు - సర్పంచులూ, డాక్టర్లూ అనే మినహాయింపులు లేక 30-40-50.... మంది ఒక తపస్సులాగా ప్రతి బ్రహ్మముహుర్తాన జరుగుతునే ఉంటవి. ఆ రెండు గంటలూ గొప్పవాళ్లనీ, సామాన్యులనే తేడా లేకుండా ఊరి సంక్షేమమే లక్ష్యంగా – ఏ కాలంలో ఏ గ్రామాలకైనా ఆదర్శంగా - తారతమ్యాలు మరచిన, కుల-మత-ప్రాంత- రాజకీయ ప్రస్తావనల్లేని పౌర బాధ్యతలవి!
నేనిది వ్రాస్తున్న 6.10 సమయానికింకా ఆ కర్మవీరులు అవనిగడ్డ మార్గంలోని అమరుల స్థూపం లోపలా, బైటా, సువిశాల రహదారి 100 గజాల బారునా విజృంభిస్తూనే ఉన్నారు. DRK డాక్టరు గారి విజిలు మ్రోగేముందే చెత్తకుప్పల లోడింగు పూర్తిచేయాలనే పట్టుదల - వాళ్ల కళ్లలో కనిపిస్తూనే ఉంది.
ఇప్పటికే తాము ఈ పూట తలపెట్టిన 3 విధాల సేవలూ పూర్తి ఔతున్నవి –
1) స్థూప అంతర్భాగంలో నిన్నటి తరువాయిగా ముగ్గుర్నలుగురి పార చెక్కుడులూ, గడ్డి నరుకుడూ, క్రొత్త మొక్కల పాదుల సవరణా వగైరా,
2) బైట ప్రక్కన ఫెన్సింగు లోపల ఒక్క రాతి ముక్క లేకుండ – ప్లాస్టిక్ వ్యర్ధం లేకుండ, గడ్డి పరక మిగలకుండా, ఎగుడు దిగుళ్ళు సమం చేసే శ్రమన్నమాట! బహుశా బైట కూడ రెండు ఉద్యానాలు తయారు కావచ్చు.
3) అదుగో - విజిల్ మ్రోగనే మ్రోగింది - లోడింగు పూర్తి కావడంతో, కట్టె పుల్లలు గుట్ట పేర్చడం ముగియడంతో - కార్యకర్తల ఆవేశం తగ్గింది. కాఫీల వేళయింది.
నేటి తుది సమావేశం గంధం వెంకటేశ్వరరావు గారి స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతో ప్రారంభమై, డి.అర్.కె. గారి వంటి వివరణలతోనూ,
రేపటి స్వచ్చ యజ్ఞ వేదిక అమరస్థూపం నుండి చల్లపల్లి దిశగా అనే నిర్ణయంతోనూ సోమవారం శ్రమదాన సమాప్తి!
మనస్సెంత చలించక......
జాతి బహుమతి గ్రహీత సుద్దాల అశోక్ తేజ
అంతర్జాతీయ కవి చంద్ర బోసు వంటి వారు
మనస్సెంత చలించకే మన ఊరికి వచ్చితిరా?
ఆ సామాజిక బాధ్యత కంజలించ కుందునా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
22.12.2025