పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా?
శుక్రవారం(23-1-26) నాటి 3722* వ శ్రమదానం!
అది మళ్ళీ పూర్తిగా RTC బస్ స్టాండుకు కాకున్నా, వెలుపలి మరియు తూర్పు వైపు 2 రోడ్లకూ పరిమితమయింది. కార్యకర్తలు 27+2 మంది. అనగా + ఇద్దరూ అతిధి కార్యకర్తలనుకోండి!
చేస్తూ ఉండాలేగాని, ఈ బృహత్పంచాయతిలో పంచాయితీ సిబ్బంది కాక - 30, 40 మంది కార్యకర్తలు కాక – 24 మంది ట్రస్టు కార్మికులు కాక 40-50 మందికి సరిపడా ప్రతిరోజూ పని దొరుకుతూనే ఉంటుంది. మరి పాతిక వేల జనాభా కదా, అందులో కనీసం 3 వ వంతు స్వచ్చ - శుభ్ర - గ్రామ సౌందర్య స్పృహ చాలని వాళ్లు కదా!
నేటి వేకువ స్వచ్చంద శ్రమనే చూడండి – 4:15 కే పది మంది పంచముఖ ఆంజనేయస్వామి గుడి దగ్గర పనులకు ఉద్యుక్తులయ్యారా, తరువాత వచ్చిన వాళ్లొచ్చినట్లు చకచకా పనిముట్లు ధరించి, పనుల్లో దిగారా, 6:18 దాక - అంటే 2 గంటలు సమయాన్నీ, శ్రమనూ గ్రామ వీధికి సమర్పించారా!
అప్పుడు గదా – బస్ ప్రాంగణం లోపలా, వెలుపలా 6.30 సమయంలో ఒక సర్వాంగ సుందరమైన –
- గార్డెన్ ఫెన్సింగులు చక్కబడి,
- ఎకరం వైశాల్యం కోట – బస్ స్టాండు నడిమి భాగం అధ్భుతంగా రూపొంది
- కళ్లేపల్లి వైపు రహదారీ, గుడి దక్షిణపు రోడ్డూ,
- వైశ్య బజారు దిశగా వీధి భాగమూ, కోట మూలలా
ఇంతగా ఆకట్టుకొంటున్నది?
- “ఇదిగో - ఇది మా శ్రమదానంతో ఈ పూట ఊరుకు గర్వకారణంగా తయారైన గ్రామభాగం” అని కార్యకర్తలకు సంతృప్తిదాయకమైనది?
నిన్న తోట నాగేశ్వర RTC వాహన చోదకుడూ, నేడు మాలెంపాటి అంజయ్యా
చక్కగా వినిపించిన నినాదాలు పూర్తయ్యాక,
క్రాంతి కళాశాల విద్యార్థినీ విద్యార్థులు నిన్న రహదార్ల శుభ్రతకు దిగిన సంగతిని
DRK గారు వినిపించాక,
రేపటి వేకువ మన కలయిక Avg, రోడ్డులోని కరీముల్లా డ్రసెస్ వద్దనని ప్రకటించాక - ఈ శుక్రవారపు శ్రమదానం రేపటికి వాయిదా పడింది.
సామాజిక బాధ్యత తగు మాత్రం
అతడే ‘గోపాల కృష్ణ’ పశు వైద్య ప్రముఖుడు
ఎనబై ఏడేళ్లై వయో వృద్ధ స్వచ్చ సేవకుడు?
ఈ వయసున ఈ వేకువ సేవలింత అవసరమా?
తన సామాజిక బాధ్యత తగు మాత్రం చాలకనా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
23.01.2026