పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
3803* వ శ్రమ సంపద సైతం పాగోలు రోడ్డుకే అంకితం!
ఔను-2 రోజుల్లో ముగించాలనుకొన్న ఈ రహదారి సేవలు 6 వనాడు కూడ ముగియలేదంటే,
వేకువ 4.11 తరువాత చందమామ అపార్ట్మెంట్ల వద్దకు 23 మంది కార్యకర్తలు చేరుకొన్నా, అదనంగా ఇద్దరు స్థానికులు శ్రమ వేడుకలో పాల్గొన్నా..
బండ్రేవు వంతెన మొదలు 50 గజాల మేర రోడ్డునూ, డ్రైన్ల తుక్కునూ ఊడ్చి, మరొకమారు ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలను ఏరినా,
కొన్ని చెట్లను సుందరీకరించినా, తుఫానుకు ఒరిగిన చెట్లను మరరపంతో ఖండఖండాలుగా కోసినా,
బాగా పొడవైన - బరువైన సిమెంటు స్తంభాలను రోడ్డుకడ్డు తొలిగించి అందంగా సర్దినా,
ఒకానొక రామా యాక్స్ టైలర్ విన్నకోట వారు చెత్త బండెక్కి సర్ది, రకరకాల తుక్కు సేకరణకు 10 మంది కార్యకర్తలు ఉరుకులు పరుగులు పెట్టినా,
తుఫానుకూ, భారీ వర్షాలకూ, కాల్వలోకి పశువులు ఎక్కుడూ దిగుళ్లకూ సిమెంటు రోడ్డు మార్జిన్ మట్టికొట్టుకుపోయి రహదారి మన్నిక దిగజారుతున్నదని కార్యకర్తలు దిగులు చెందినా,
అంబేత్కర్ వేడుక కోసం కొందరు కార్యకర్తలు NTR పార్కుకు వెళ్లడంతో వాలటీర్ల సంఖ్య తగ్గినా,
ఊళ్ల వీధులతోబాటు ప్రక్క ఊరి రహదారి శుభ్ర - సుందరీకరణ యజ్ఞం ఈ మంగళవారం (14-4-26) ఆగలేదు!
రోడ్డు ప్రక్క బరంతులు కూడ జరుగుతూనే ఉన్నవి!
6.25 కు అదే పాగోలు బాట మొదట ఇళ్ల వద్ద అందరూ ఏక కంఠంతో బొందలపాటి నాగేశ్వర కార్యకర్త చెప్పిన నినాదాలను అందిపుచ్చుకొన్నారు,
జరుగుతున్న - జరుగనున్న శ్రమదాన వివరాలను DRK గారు ప్రకటించాక,
రేపటితో ఈ రహదారి సేవలను ముగించాలని నిర్ణయించారు.
గ్రహించేది ఎప్పుడని?
ఇది తప్పేమీ కాదని – ఇది నామోషీ కాదని-
తమకూ తమ ఊరి జనుల మేలు కొరకు మాత్రమనీ-
సామాజిక శ్రమ వేడుక సర్వులకూ ఉత్తమమని-
చల్లపల్లి ప్రజలెల్లరు గ్రహించేది ఎప్పుడని?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
14.04.2026