పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
18 వ ఏప్రిల్ – 2026 (స్థిరవారం) వీధి శ్రమ విశేషాలు - @3807*
పాగోలు - చల్లపల్లి బాట సగాన - NTR పాఠశాల పడమరగా జరగబోయే శ్రమదానానికి 4:20 AM కే కనీసం20 మంది - 8 మంది మహిళలతో సహా - ఎదురుచూస్తున్నారు! 100 నిముషాల తర్వాత సదరు రహదారి అందానికీ, 4:20 కి ముందటి వ్యర్ధాలతో నిండిన బాటకీ పోలికే లేదు!
అక్కడ ఉన్నది 100 గజాల రకరకాల వ్యర్ధాలు పరచుకొన్న బాటా, దాని కనుబంధంగా బోదె కాలువలూ! డ్రైనైనా ఖాళీగా ఏంలేదు - పిచ్చి మొక్కలూ, ఎండు పుల్లలూ, ప్లాస్టిక్ తుక్కులూ తిష్ట వేసే ఉన్నాయి! చాల రోజుల్నుండి “స్వచ్ఛ కార్యకర్త లెప్పుడు వస్తారా - ఇతర రహదార్లలాగే, డ్రైన్స్ లాగే మేమూ అందంగా తయారు కాకపోతామా” అని ఎదురు చూస్తూనే ఉన్నాయి!
ఆ నిరీక్షణ ఫలించి, ఈ వేకువ 40 కు పైగా కార్యకర్తల బలగం రానే వచ్చింది, ఎవరి అభిమాన పనిముట్లను వారు ధరించనే ధరించారు, చెమటలు కారుతున్నా - చీపుళ్లు దుమ్ము లేపుతున్నా - తమ భుజాల మీద గ్రామ సమాజం మోపిన బాధ్యతను నెరవేర్చుకొన్నారు!
6:10 తర్వాత ఎవరు కష్టించి, బాగుచేసిన చోటులను వారు కళ్లారా చూసుకొని,
కాఫీలు సేవించి,
అడపా వాని అనారోగ్యాన్ని తెలుసుకొని,
MEO పరిశే వెంకటేశ్వరరావు గారి నినాదాలకు తగురీతిని స్పందించి,
నందేటి శ్రీను గారి గానానికి అనందించి,
DRK గారి పని సమీక్షను ఆమోదించి,
రేపటి వేకువ కూడ ఈ పాగోలు రహదారి బాధ్యతనే స్వీకరించాలని నిర్ణయించి, ఇళ్ళు చేరుకొన్నారు!
అంతకుముందు కత్తుల వారి సుందరీకరణ కారణంగా తెగిన చెట్ల కొమ్మల్ని ప్రక్క చేలోకి మోసి, షెడ్డర్ లో పొడి చేసినా,
మొక్కల పాదులకు మట్టి పెళ్లలు అమర్చినా, అవన్నీ స్వచ్ఛ కార్యకర్తల శ్రమదాన క్రీడలో భాగాలే!
చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమ పారదర్శకతకూ సమష్టి నిర్ణయాలకు గుర్తుగా గత నెల ‘మనకోసం మనం’ ట్రస్టు ఆదాయ వ్యయ పట్టికను DRK గారు చదివి వినిపించగా అందరూ ఆమోదించారు.
చుట్టూ 9 దారుల సొంపులలో
ముప్పది వేలకు పైగా మొక్కల సౌందర్యములో
చుట్టూ 9 దారుల సొంపులలో - సొగసులలో
క్రమ శిక్షణ పాటించే గ్రామ మురుగు కాల్వల లో
క్షణక్షణం కార్యకర్త శ్రమ సాక్షాత్కరిస్తోంది!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
18.04.2026