3808* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

19-4-26 - ఆదివారం వేకువ శ్రమ సమాచారం! - @3808*

               4:20 వేళకే ఈ నాటి శ్రమదాన గంట మ్రోగించింది 15 మందైతే - చల్లపల్లికి దూరంగా – NTR స్కూల్ వద్దకు చేరుకొని, ఆ గంటను పదే పదే మ్రోగించిన వారు మొత్తంగా 43 మంది!

               ఎంతసేపూ ప్రాత కార్యకర్తలు మ్రోగించడమే తప్ప – కొంగ్రొత్త ఔత్సాహికులు మ్రోగించరెందుకో తెలియదు!

               “అప్పుడప్పుడైనా గ్రామస్తులూ, అచ్చటి ఇళ్ల వారూ వచ్చి, మ్రోగించి చూస్తే తప్ప ఆ సామూహిక సామాజిక శ్రమదాన ఘంటారావం ఎంత శ్రావ్యమో - ఎంత ప్రయోజనకరమో ఎలా తెలుస్తుంది?” అనుకొంటూ ఉంటాను - అది ఈ ఆదివారం నేరవేరింది – మిలిటరీ శ్రీనివాసరావు గారి అబ్బాయి - శాయి ఈపూట శ్రమదానంలో పాల్గొన్నాడు!

               స్వయంగా పాల్గొనే వాళ్లకి తప్ప – “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం”  వాట్సప్  రిపోర్టు చదివే కొందరికి – “ఏమిటి ఈ శ్రమదానం? 11 రోజులుగా ఆ కాస్త రోడ్డులో ఇందరు ఏంచేస్తున్నట్లు?” అనిపించవచ్చు! కాని – ఆ రోడ్డునే తమ సొంతిల్లనుకొని, ఆ చెట్లను తమ పిల్లలనుకొని, ఊడుస్తూ - చెట్లకు పాదులు చేస్తూ రోడ్డు గుంటలు పూడుస్తూ -  డ్రైన్లనూ, బాట మార్జిన్లనూ ప్లాస్టిక్ రహితంగా మారుస్తూ - ప్రతి మొక్కనూ సుందరీకరిస్తూ - నిత్యం వందలాది మందికి ఆహ్లాదం పంచుతూ అనందించే కార్యకర్తలకు తెలుస్తుంది తమ శ్రమదానంలోని మజా!

               నిన్న సహ కార్యకర్తలకు ఒక అన్నపూర్ణ రాగి జావ పంచితే, నేడు తుది సభను పల్నాటి భాస్కరులు నినాదాలతో ప్రారంభించారు, అప్పుడు DRK గారు యధాప్రకారం పనులను సమీక్షించారు.

               రేపటి శ్రమదాన స్థలం కూడ పాగోలు బాటలోనే అని నిర్దేశించారు.

                     వైశాల్యం పెరగాలని

మనిషికి – హృదయం ఉండిన చాలదు – వైశాల్యం పెరగాలని

కండ బలం గుండె బలం గ్రామానికి దక్కాలని

ఉమ్మడి సౌఖ్యం లోనే వ్యక్తి సుఖం దాగుందని

స్వచ్చ కార్యకర్తల శ్రమ చాటుతోంది ప్రతి వేకువ!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  19.04.2026