పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
ఈ సోమవారపు (20-4-26) శ్రమదాన కథ! – @3809*
ఈ కథాస్థలం12 వ నాడు కూడ పాగోలు రహదారే! కథాకాలం వేకువ 4.17 - 6.05; రచయిత్రీ రచయితలు 30 మందికి పైగా :
ఉబుసుపోకకు వ్రాసే - చదివే కథ కాదిది; తమ లక్ష్యసాధనకై వేల కొద్దీ రోజుల నాలుగున్నర లక్షల పనిగంటల - చెమట పోతల కథ ఇది! ఎందరో ఇతర గ్రామాల వారిలో స్ఫూర్తి రగిలించి, సామాజిక సత్కార్యాలకు పురిగొల్చిన మన సమకాలిక కథా రత్నమిది!
చల్లపల్లి పరిధి దాటి - పొరుగున పాగోలు బాటలో 12 రోజులుగా ఒక వంక స్వచ్ఛ కార్యకర్తలూ, మరో వైపున ట్రస్టు కార్మిక సోదరులూ చీపుళ్ళతో తుడుస్తున్న - కత్తులతో గడ్డినీ, పిచ్చిమొక్కల్నీ, వంకర చెట్ల కొమ్మల్నీ తొలగిస్తున్న - అంటే రహదారిని సుందరీకరిస్తున్న – ఏరోజుకారోజు సంతృప్తి పొందుతున్న ఈ సజీవ శ్రమ గాథలో:
- 15 వేల కిలోమీటర్ల దూరాన నివసించే ఒక నాదెళ్ల సురేష్ పాల్గొని, తన గ్రామ సామాజిక ఋణభారం దించుకొన్నాడు!
- 86 ఏళ్లు దాటుతున్న పశు వైద్యునితో సహా ముగ్గురు వైద్యులు శారీరక శ్రమకు పాల్పడ్డారు!
- నర్సులు తుక్కు డిప్పలు, చెట్ల కొమ్మలూ మోశారు!
- కొందరు మొక్కలకు పాదులు త్రవ్వారు!
- దారిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తురహితం చేశారు!
6.10 నుండి మంచి కాఫీలు సేవించారు! స్వచ్ఛ కబుర్లాడుకొన్నారు! అందరూ రోడ్డు వార నిలబడ్డారు! అప్పుడందుకొన్నారు అడపా వారు మైకును - స్వచ్ఛోద్యమ ఆశయాల సారమైన నినాదాలను వారు ప్రకటిస్తుంటే కార్యకర్తలంతా పునరుద్ఘాటించి, గురవయ్య గారి సూక్తులాలకించారు!
ఈ 100 నిముషాల కార్యక్రమాన్ని చూస్తూ DRK గారు అనందం దాచుకోలేకపోయారు!
రేపటి శ్రమదాన నిమిత్తం ఇదే పాగోలు బాటలో కలవాలని నిర్ణయించారు.
నిర్వచనం దొరికిందా?
ఎక్కడైన – ఎప్పుడైన ఈ త్యాగం చూశామా!
ఇన్ని వేల దినాలుగా ఎవరైనా శ్రమించారా!
స్వార్థానికి చరమ గీతి చప్పుడు వినిపించిందా?
పరోపకారాని కిచట నిర్వచనం దొరికిందా?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
20.04.2026