3810* వ రోజు....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

మంగళవారానిది (21-4-26) 3810* వ రహదారి శ్రమ!

               అది కూడ పాగోలు బాటలోని NTR పాఠశాల ప్రాంతమే! అదేమో మరీ వేకువ 4.17 సమయమే! మాటలు వెదుక్కోకుండా చప్పున చెప్పాలంటే - ఈ నాటి 31 మంది వీధి బాగుచేత పనులు అనివార్యమైన వ్యసనమే! ప్రాత వాళ్ళ సంగతలా ఉంచి, మరో 10 రోజుల్లో జాతీయ స్ధాయిలో వైద్య విద్య ప్రవేశ పరీక్షకు నిలవవలసిన ‘పేరుబోయిన సాయి’ అనే యువకునికి ఆ వ్యసనం తగునా?

               అసలా పాగోలు బాట ఈ 39 మందిలో ఎవరి ఇంటి ఎదుటా లేదు; దాని మీద దుమ్ము పేరుకుపోతే - గుంటలు పడితే - రోడ్డు తమ ఇంటి అవరణలా శుభ్రంగా లేదనిపిస్తే - ఎవరో కర్కశంగా నరికి వదిలేసిన కొమ్మలు వికృతంగా కనిపిస్తే – గడ్డి మొలిస్తే - ప్లాస్టిక్ తుక్కులు పడి ఉంటే.. అవన్నీ వీళ్లకెందుకట?

               ముళ్ల చెట్ల కొమ్మల కత్తిరింపులు దుర్గా ప్రసాదుకవసరమా? వాటిని పొలంలోకి లాక్కెళ్లి షెడ్డర్ నోటికందించే సాహసం మహిళా కార్యకర్తలు ప్రదర్శించాలా? ఆ సజ్జా ప్రసాదు మాత్రం? ఒక్క నిముషమైనా విశ్రాంతి పొందక - చెమటలు ధారలుగా కార్చాలా? ఏదో కాస్త షో చేస్తే చాలదా?

               మనలో మాట - కార్యకర్తలందరూ కొంచెం ‘లౌక్యం’ నేర్చుకోండయ్యా! ప్రెస్ వాళ్ళున్నప్పుడు మాత్రం కష్టపడండి - చెమటలు తుడుచుకోకండి - ఏదో 4 ½  లక్షల పనిగంటలు మన ప్రాంతానికి చాతనైనంత సేవ చేశారు చాలదా?  అమ్మాయిలు కూడ అంతంత బరువు డిప్పలు మోయాలా? మొక్కలకు వ్రేలాడే గడ్డి పరకల్ని కూడ దులపాలా?

               నడుముల్ని కాపాడుకోరా? ఊడ్చి, ఊడ్చి గూళ్ళరక్కుండా జాగ్రత్త పడొద్దా? ఆబాల్య కార్యకర్త దేసు జాహ్నవి మాత్రం అంత ఉత్సాహంగా నినాదాలు  పలకాలా?

               అమెరికా నుండి తెచ్చిన చాక్లెట్లను సురేష్ నాదెళ్ళ అందరికీ అంత అభిమానంగా పంచాలా?  

               ఇద్దరు గట్టి కార్యకర్తల తండ్రి కస్తూరి కృష్ణమూర్తి గారి మరణ వార్త తెలిసి, కార్యకర్తలు కడసారి చూసి వచ్చారు!

               రేపటి వేకువ పని వ్యసనం కోసం ఇదే పాగోలు రహదారిలో కలుసుకోవాలని నిర్ణయించుకొన్నారు!  

               కాదది దాతృత చాటుట!

ఒకొక ట్రస్టు ఉద్యోగిని ఒక దాత భరించుటనగ

మూడేళ్లా పద్ధతిలో ఊరి ప్రగతి నిలుపుటనగ –

కాదది అద్భుత సేవన - కాదది దాతృత చాటుట!

తన సామాజిక బాధ్యతలను గుర్తెరుగుటె - నెరవేర్చుటె!

అప్పుడతడు ఆదర్శుడె  - అభినందనలకు అర్హుడె!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  21.04.2026