పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
22-4-26 - బుధవారం – 3811* వ విడత పాగోలు రోడ్డులో!
ఈనాటి శ్రమదానం 11 మందితో 4.24 కు మొదలై, 6.08 కి 24+5=29 మందితో ముగిసింది. స్థలం మళ్లీ అదే పాగోలు రహదారిలో అదే NTR పాఠశాల ప్రాంతమే!
మరి - ఈ 100 నిముషాల వ్యవధిలో ఏ కార్యకర్త ఎంత శ్రద్ధనూ, శక్తినీ ఆ బాటకు సమర్పించారో – తద్ద్వారా ఎంత సంతృప్తిని మూట గట్టుకున్నారో –
ఎవరి బట్టలు చెమటకు ఎంతగా తడిసి, దుమ్ము కొట్టుకొన్నాయో - ఏ మహిళామణుల చేతులు నొప్పి చేశాయో - ఐనా సరే రేపటి శ్రమదానానికి వాళ్లు మళ్లీ పూనుకొంటారో –
ఎందరు ఎన్ని చెట్ల కొమ్మల్ని పొలంలోని షెడ్డర్ కు అందించారో - ఏ నిపుణలు వాటిని పొడిగా మార్చారో –
ఇంకా ఎన్ని లావుపాటి కొమ్మల్ని సైజులుగా చేసి, పరిసర గ్రామస్తుల వంట చెరకుగా ఉపయోగానికై గుట్టలుగా పేర్చారో –
రోడ్డు మార్జిన్ల పల్లాలనూ, గుంటల్నీ ఎన్నిటిని సరిచేశారో –
ఎన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని ఏరి సంచులకెత్తారో –
అసలా రహదారి 2 వారాలుగా కార్యకర్తల పరిశ్రమతో రోజురోజుకీ ఎంత అందంగా మారుతున్నదో... ఈ చల్లపల్లి, పాగోలు, కొత్తపాలెం గ్రామస్తుల్లో ఎందరు గమనిస్తున్నారు గనుక! కార్యకర్తలతో ఎందరు సహకరిస్తున్నారని! వెళ్తూ - వస్తూ ఈ బాట శుభ్రతను గూర్చి ఆలోచిస్తున్నారని!
కాఫీ/సరదా ముచ్చట్లు తరువాత నేనిప్పటి దాక వ్రాస్తున్న సంగతులనే Dr. డి.ఆర్.కె. గారు తన పద్ధతిలో ప్రస్తావించారు! పాగోలు వాస్తవ్యులు యార్లగడ్డ శివప్రసాదు గారి (5x10,000) 50 వేల ఇటీవలి చందాను గుర్తుచేశారు. నిన్న MLA గారితో కలిసి, కాసానగర్ వద్ద వేస్తున్న సిమెంటు రోడ్ ఖర్చును గూర్చి వివరించారు!
అంబటి శంకరుల వారు నినాదాల కోసం గొంతు విప్పారు!
రేపటి వేకువ బాధ్యతల కోసం మహాబోధి బడి చిన్న గేటు వద్ద కలవాలని నిర్ణయించారు!
జీతమెంత? భత్యమెంత?
“ఎవరండీ ఈ కార్మికు - లెవరండీ ఈ సేవకు
లెందుకు ఈ వేకువ సేవలు? ఏల చెత్తమురికి పనులు?
జీతమెంత? భత్యమెంత? జై జై అని నినాదమేల?”
అనెడి ప్రశ్నలిప్పటికీ వినిపించుట విచిత్రమే!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
22.04.2026