3857* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.

నాగాయలంక బాట స్వచ్చ- శుభ్ర సుందరీకరణలో 42 మంది పిచ్చోళ్లు!

ఆదివారం (7.6.26) వచ్చిందంటే చాలు- అమావాశ్యకు కొందరికి పిచ్చి ముదిరినట్లు - స్వచ్ఛ కార్య కర్తలకు సేవా దృక్పథం ముదిరిపోతుంది! అందువల్ల వాళ్లు వేకువ 4.30 కు బదులు 4.15 కే అమర స్థూపం వద్ద ప్రత్యక్షమయ్యారు!

గ్రామ సేవా వ్యసనం 42 మందిదైతే ప్రక్కన ఫాక్టరీ వర్కర్లు ముగ్గురు కూడా చివర్లో వచ్చారు. సరే- ఇక వాళ్ల  పనుల్ని గురించి చెప్పేదేముంది– కళ్ళెదుట ఊడవవలసిన సువిశాల రహదారీ, రెండు వైపుల డ్రైన్లలో రకరకాల కాలుష్యాలూ కనిపిస్తుంటే రెచ్చిపోక ఆగుతారా? DRK గారి తొలి విజిల్ శబ్దాన్ని లెక్క చేస్తారా?

చీపురు, గొర్రు, కత్తి, మర రంపం, డిప్ప, తలదీపం, చేతొడుగుల వంటి ఎవరి పనిముట్లను వారు ధరించి, 6.05 దాక చెత్తా చెదారాలనూ, చెట్ల వికారాలనూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లనూ, దుమ్మూ - ధూళినీ తుద ముట్టించారు!

ఇంతవరకు 12 ఏళ్ళ నుండి ఈ  ప్రతిదిన శ్రమదానాన్ని అంతగా పట్టించుకోని చల్లపల్లి గ్రామస్తులు అనుకోకుండా ఈ వేకువ 100 నిముషాల కార్యకర్తల పనుల్ని శ్రద్ధగా చూశారే అనుకో - ఏమనిపిస్తుంది?

-"అరె ! ఏదో అనుకొన్నాం- నిజంగా మన ఊళ్లోనే రోజూ 30-40-50 మంది ఏ చిన్న స్వార్ధమూ లేకుండా 12 ఏళ్ల నుండి ఇంతగా శ్రమిస్తున్నారా? ఇంత డబ్బు ఖర్చుపెటుతున్నారా? అందుకేనా ఊళ్లో ఇన్ని మార్పులూ, సౌకర్యాలూ ?"అనిపించ వచ్చు-

"ఇందులో సగం మంది ఇతర గ్రామ కార్యకర్తలు కూడానా? ఇప్పటికి 4 ½  లక్షల పని గంటల బాధ్యతలా?"  అని కూడ తెలుసుకోవచ్చు!

(వాళ్లలో కాస్తంత స్పందనా గుణం ఉంటే - రేపటి నుండి కార్యకర్తలుగా మారినా మార వచ్చు!) “అరె! ఆ పొలం గట్ల పరిశుభ్రత లేంటీ- తాడి, ఈత చెట్ల అలంకరణ లేమిటీ ? వయో భేదాలూ, ఆడా - మగా ఆలోచనలూ వదిలేసి, ఈ మురికి, చెత్త కంపు పనులేమిటీ? ”అని కూడ సందేహించనూవచ్చు!

6.20 కి నినాదాలు వల్లించి, విశ్రాంత ఇంజనీరు అంబటి బసవ శంకరుడు దంచిన సుదీర్ఘ స్వానుభవ ఉపన్యాసం విన్నారను కోండి - సిగ్గుపడి, విధిగా రేపటి వేకువ కార్యకర్తలతో కలిసి రావచ్చును కూడ!

రాబోవు 4 నెలల 8000/- చందాను 86 ఏళ్ల Dr. గోపాల కృష్ణయ్య ట్రస్టుకు ఇవ్వడ మెందుకో కూడ వాళ్ళ కర్థం కావచ్చు !

అలా వచ్చే కార్యకర్తలకు నాగాయలంక రోడ్డులోని అమరస్తూపం వద్దకు రేపటి వేకువ స్వాగతం!

                 పెద్ద చదువుల సరస్వతిగా

పెద్ద చదువుల సరస్వతిగా, పాఠ్యబోధక ఉపాధ్యాయిని -

యూ.టి. ఎఫ్. లో పాత్రధారిణి, H.M.గా ముఖ్య భూమిక,

వైద్యశిబిరపు కార్యకర్తగ, స్వచ్ఛ సుందర సేవికగ,

సుభాషిణి బహురూపధారణ చూసి మెచ్చని వారుకలరా?

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   07.06.2026