3984 వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికే పనికొచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడే వాళ్ళందరం సిగ్గుపడదాం!

ఈ బుధవారం (14.10.26) నాటిది 3984* వ శ్రమ వేడుక!

               ఇప్పటికే నాలుగైదు లక్షల పని గంటల శ్రమను చల్లపల్లికి ధారాదత్తం చేసిన - చేస్తున్న స్వచ్ఛ కార్యకర్తలనబడే ఈ వేకువ కష్టజీవులు 16+16 మంది! మొదటి 16 మంది 4:30 దాక అగలేక - 4.19 కే వివిధ గ్రామాల – వార్డుల నుండి MDO కార్యాలయానికి చేరుకొన్నవారు కాగా - ఖచ్చితంగా సమయపాలనకు కట్టుపడిన వాళ్ళూ, కొన్ని నిముషాల తడబాటుతో వచ్చిన వాళ్ళూ మిగిలిన షోడష  సంఖ్యాక పనిమంతులన్నమాట!

               ఇక నేటి వేకువ గంటన్నరకు పైగా తమ శ్రమను వాళ్లంతా ఎక్కడ - ఎలా దానం చేశారో - ఆ కష్టం ఊరికేం ఒరగ బెట్టిందో - నేను వివరించడమెందుకు? చదువరులు కాస్త ఓపిక చేసుకొని, HDFC & MDO ఆఫీసుల పరిసరాలనూ, NTR విగ్రహం దాక బెజవాడ బాటనూ, బాట తూర్పున మురుగుకాల్వనూ, బైపాస్ వీధి కలయిక వద్ద పూడిన గుంటనూ చూస్తే తెలుస్తుంది! లేదా –

               “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” అనే వాట్సప్ ఫొటోలను చూసినా గ్రహించవచ్చు!

               చల్లపల్లి మండలాభివృద్ధి కార్యాలయం గేటు, లోపలి కుడి ఎడమల ప్రాంతాలెంత శుభ్రపడినవో తెలుసుకోవచ్చు!

               వైరల్ జ్వరాన్ని ఇంజెక్షనన్లతోనూ,సెలైన్ బాటిళ్లతోనూ ఎదుర్కొని, తగ్గించుకొని వారం రోజులు శ్రమదానానికి మొహం వాచిన ‘ఆకుల దుర్గా ప్రసాదు’ కరువు తీరా ఎలా శ్రమించిందీ ఫొటోలే చెప్పుతాయి!

               తన షెడ్యూలు ప్రకారం ఆదివారం కుదరక - ఈ బుధవారం వచ్చి శ్రమదాన బాకీ తీర్చుకొన్న మరొక ఆకుల రాఘవ కార్యకర్త పనీ కనిపిస్తుంది ఛాయాచిత్రాల్లో!

               మరొక ఆసక్తిదాయక పోలికను ముగ్గురు కార్యకర్తలు చెప్పుకొంటుండగా నా చెవిన పడింది : అదేమనగా –

               “ఈ పూట మనం చేసిన పని సఙ్ఞా ప్రసాదు గారి పనితో సమానం కాదా?..” అని!

               ఇందులో ఆసక్తికర విశేషమేమంటే : వీళ్ళు పోల్చుకొంటున్నదీ, పోటీపడ చూస్తున్నదీ లక్షలూ - కోట్లూ అక్రమంగానో సక్రమంగానో ప్రోగేసుకోవడం గురించి కాదు - రాబోయే పదవుల ఎన్నికల్లో గెలవడం గురించీ కాదు - ఊరి ప్రయోజనం కోసం తాము చేస్తున్న మురికి - బురద – కంపు - దుమ్ము పనుల్లో!

               వీధి పనులు ముగిశాక MDO కార్యాలయం వద్ద కూడ పట్టుదలగా గ్రామ మెరుగుదల కృషి ప్రతిజ్ఞలప్పుడు కూడ - 31 మంది కార్యకర్తలూ వీరశేఖరుడూ పోటీపడ్డారు!

               గ్రామంలో ఇంకా మిగిలిపోతున్న పనుల గురించి సమీక్షిస్తూ, DRK గారు తమ వేదన వెలిబుచ్చాక –

               రేపటి శ్రమదానం కోసం నడకుదురు బాట ప్రక్క ఇంధన నిలయం వద్ద కలవాలని వారే సెలవిచ్చారు!

               ఉరుకుతున్నవి చూడు నేస్తం!

రథం ఇరుసుగ కార్యకర్తలు, ఇరుసు కందెనలుగా దాతలు

యాత్ర కుంటక నడుస్తుందుకు గ్రామ పంచాయతీ చర్యలు

ప్రభుత్వ ప్రోత్సాహములు ఇంకా ప్రజల నుండి సానుభూతులు

ఉన్న వందుకె రథం యాత్రలు ఉరుకుతున్నవి చూడు నేస్తం!

-నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   14.10.2026